భారత స్టార్, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించి సత్తా చాటింది. ముచ్చటగా మూడో స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకను చైనా గగనతలంపై రెపరెపలాడించింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన జ్యోతిసురేఖ... ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలోనూ పసిడి పతకం అందుకుంది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 149-145తో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ అద్భుత ఆటతీరుతో గెలుపొందింది. ప్రారంభంలో కాస్త తడబడ్డ ఈ భారత స్టార్‌ ఆర్చర్‌.. తర్వాత తన అనుభవాన్నంత ఉపయోగించి అద్భుతంగా పుంజుకుంది. 


మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రారంభంలో 8 పాయింటర్‌ ప్రారంభించిన సురేఖ.. తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి రెండు రౌంట్లలో జ్యోతి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తర్వాత 149-145తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
 అంతకుముందు ఆర్చరీలో భారత్‌కు మరో కాంస్య పతకం కూడా దక్కింది. అదితి గోపీచంద్ స్వామి 146-140తో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ జిలిజాటిని ఓడించి కాంస్య పతకాన్ని సాధించి ఆసియా గేమ్స్‌ చివరి రోజు భారత్‌కు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చింది. అదితి 17 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా అదితి బంగారు పతకం సాధించింది. 






ఆసియా గేమ్స్‌లో ఆర్చరీలో భారత్‌కు ఇది ఏడో పతకం. ఈ విభాగంలో భారత్‌ ఇప్పటివరకూ నాలుగు స్వర్ణాలు గెలవగా.. అందులో మూడు పసిడి పతకాలు రావడంతో  జ్యోతి సురేఖ భాగస్వామిగా ఉంది. ఈ పతకాలతో భారత్‌ ఇప్పటివరకూ ఆసియా గేమ్స్‌లో 97 పతకాలు సాధించింది. ఇందులో 23 స్వర్ణ పతకాలు, 34 రజతాలు 40 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా గేమ్స్‌ 2023లో ఇప్పటికే 100 పతకాలు ఖాయం చేసుకున్న భారత్... కొత్త చరిత్రను లిఖించింది. 


 ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్‌లో ఆల్-ఇండియా పురుషుల వ్యక్తిగత ఫైనల్‌లో ఓజాస్ ప్రవీణ్-అభిషేక్ వర్మ ఒకరితో ఒకరు తలపడనుండగా, మహిళల కబడ్డీ జట్టు ఫైనల్‌లో చైనీస్ తైపీతో తలపడుతోంది. మరికొన్ని నిమిషాల్లో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 100 దాటనుంది. 


శుక్రవారం జరిగిన  ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో చైనీస్‌ తైపీని ఓడించి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందం పసిడి గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ జంట 159–158తో సో చేవన్‌–జేహూన్‌ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. సురేఖ–ఓజస్‌ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్‌ జోడీపై, క్వార్టర్‌ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది.