IPL 2025: IPL 2025 మళ్ళీ మే 17 నుంచి ప్రారంభంకానుంది. దీని కంటే  ముందు IPL జట్లకు ఓ కొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది విదేశీ ఆటగాళ్ళు ఈ  సీజన్‌లో కంటిన్యూ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయా దేశాల క్రికెట్  బోర్డులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, దక్షిణాఫ్రికాకు చెందిన 8 మంది ఆటగాళ్ళు IPL ను మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారని వార్తలు వస్తున్నాయి. నిజానికి, క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) తమ ఆటగాళ్ళు IPL లో ఆడటానికి గడువు విధించింది. 

దీన్ని బట్టి, BCCIకి వ్యతిరేకంగా క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, BCCI అన్ని విదేశీ ఆటగాళ్ళు పూర్తి IPL ఆడాలని కోరుకుంటుంది, కానీ దక్షిణాఫ్రికా బోర్డ్  మాత్రం దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకుంది. 

IPL 2025 మళ్ళీ మే 17న ప్రారంభం అవుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. లీగ్ ఫైనల్ జూన్ 3న జరుగుతుంది. అదే సమయంలో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ జూన్ 11 నుంచి జరగనుంది. ఈ కారణంగానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ తమ ఆటగాళ్ళు IPL లో ఆడటానికి గడువు పెట్టింది. గడువు లోపు ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరుకావాలని సూచిస్తోంది.  

క్రికెట్ దక్షిణాఫ్రికా WTC ఫైనల్ కోసం సిద్ధమవ్వడం తమ  ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఈ కారణంగా, బోర్డ్ తమ ఆటగాళ్ళు మే 26 వరకు మాత్రమే IPL లో ఆడాలని చెప్పింది. CSA హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఎనోక్ ఎన్క్వే ప్రెస్ కాన్ఫరెన్స్ లో, "లీగ్ ఆడటానికి వారు తిరిగి రావాలా వద్దా అనేది ఆటగాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. టెస్ట్ ఆటగాళ్ళకు మే 26 గడువు నిర్ణయించాం" అని అన్నారు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయే ఛాన్స్

దక్షిణాఫ్రికాకు చెందిన 8 మంది టెస్ట్ ఆటగాళ్ళు IPLలో ఆడుతున్నారు. కాగిసో రాబాడా గుజరాత్ టైటాన్స్ లో, లూంగి నగిడి RCB లో, ట్రస్టన్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లో, ఏడెన్ మార్క్రమ్ లక్నో సూపర్ జెయింట్స్ లో, రయాన్ రిక్లెటన్ ముంబై ఇండియన్స్ లో, కార్బిన్ బోష్ ముంబై ఇండియన్స్ లో, మార్కో జాన్సెన్ పంజాబ్ కింగ్స్ లో, వయాన్ ముల్డర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఆడుతున్నారు. వీరందరూ మధ్యలోనే IPL ను వదిలి వెళ్ళవచ్చు. 

ఇంగ్లాండ్ క్రికెటర్లు దూరం

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా టెస్టు, వ‌న్డే, టీ20 ఫార్మాట్ల‌కు సంబంధించిన టీమ్స్‌ను హారీ బ్రూక్ నాయ‌కత్వంలో ప్రకటించింది. ఈ నెల 21 నుంచి జింబాబ్వేతో టెస్టు, విండీస్‌తో మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వారిని జట్టులోకి తీసుకున్నారు. వాళ్లంతా ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. జోస్ బ‌ట్ల‌ర్ (గుజ‌రాత్ టైటాన్స్), జోఫ్రా ఆర్చ‌ర్ (రాజ‌స్థాన్ రాయల్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియ‌న్స్), జాక‌బ్ బెతెల్ (రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు) తాజాగా ప్రకటించిన జట్టులో ఉన్నారు. అందుకే వారు ఈ సీజ‌న్ చివ‌ర్లో అందుబాటులో ఉండే అవ‌కాశం లేదని తెలుస్తోంది.