Gambhir Vs Team India: దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్ శకం మొదలైందనే వాదన వినిపిస్తోంది. నిజానికి గతేడాది తను పగ్గాలు చేపట్టినప్పుడే తన దైన శైలిలో జట్టును నడిపించాలని గౌతీ చూశాడు. అయితే సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓటములు, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించకపోవడం లాంటివి అతని జోరుకు కళ్లెం వేశాయి. అయితే గతేడాది టీ20 ఫార్మాట్ నుంచి కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో ఆ జట్టు వరకు తన మార్కును చూపించాడు. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తో కలిసి దుర్బేధ్యమైన జట్టును నిర్మించాడు. ఇక తాజాగా టెస్టుల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు వీడటంతో తన మార్కును చూపెట్టే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా కెప్టెన్సీ రేసులో ఉన్న శుభమాన్ గిల్.. యువకుడు కావడంతో గౌతీ చకచకా పావులు కదిపే అవకాశముంది.
ఎప్పుడూ లేనిది.. అనాదిగా కోచ్ కంటే కూడా కెప్టెనే టీమిండియాలో పవర్ ఫుల్ గా ఉన్న చరిత్ర ఉంది. గతంలో బిషన్ సింగ్ బేడీ, గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే మాత్రమే కాస్త కటువైన నిర్ణయాలు తీసుకోవాలని భావించినా, జట్టులో స్టార్ల ఒత్తిడికి తలొగ్గి, వెనుకంజ వేశారు. అయితే తాజా పరిణామాలతో నూతన కెప్టెన్ రానుండటంతో గౌతీ తనదైన మార్కును చూపించే అవకాశముంది. దానికి తోడు, మాజీ సహచరుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో తోడవడం కూడా గౌతీ పని సులభం కానుంది. రాబోయే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త రక్తాన్ని జట్టులోకి ఎక్కించాలని గౌతీ తహతహలాడుతున్నాడు.
వినూత్న మార్పులు..గంభీర్ కోచ్ గా వచ్చాక, జట్టులో కొన్ని మార్పులు చేశాడు. ఆల్ రౌండర్ల పాత్ర పెంచడం ద్వారా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ జట్టు డెప్త్ ను పెంచాలని చూసినా, అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు స్టార్ ద్వయం దూరం కావడం, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం, రవీంద్ర జడేజా కూడా వయసు పైబడటంతో కొంతకాలమే అందుబాటులో ఉండటం లాంటి వాటితో గౌతీకి ఎదురే లేకుండా పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో రాబోయే రోజుల్లో అటు టెస్టు, ఇటు టీ20ల్లో మరింత భిన్నమైన జట్టును చూడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ, రోహిత్ ఆడుతుండటం, రోహితే ఈ ఫార్మాట్ కు ప్రస్తుతం కెప్టెన్ గా ఉండటంతో ఈ ఫార్మాట్ వరకు గౌతీ నార్మల్ గా వ్యవహరించే అవకాశముందని తెలుస్తోంది. వచ్చేనెలలో ఇంగ్లాండ్ పర్యటనతో గౌతీ మార్కు వ్యూహాలను చూడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ టూర్ లో టీమిండియా ఐదు టెస్టులను ఆడనుంది. వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ కు ఈ పర్యటనలో శుభారంభం చేయడం టీమిండియాకు తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.