IPL 2025: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. IPL 2025 పునఃప్రారంభ తేదీని ప్రకటించింది. ఐపీఎల్ 2025 మే 17న తిరిగి ప్రారంభమవుతుంది. ఇటీవల భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఈ లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఉద్రిక్తతలు తగ్గడంతో లీగ్ కంటిన్యూ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

"భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఐపీఎల్ మ్యాచ్‌ల పునఃప్రారంభాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలతో సంప్రదింపుల తరువాత సీజన్ మిగిలిన మ్యాచ్‌లు కొనసాగించాలని నిర్ణయించింది. మే 17వ తేదీన రీస్టార్ట్ కానుండగా, జూన్ 3, 2025 న జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ ముగియనుంది.

కేవలం 6 వేదికలలో మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి. బీసీసీఐ సవరించిన ఐపీఎల్ షెడ్యూల్‌లో రెండు డబుల్ హెడర్లు ఉన్నాయి, అవి రెండు ఆదివారాల్లో జరుగుతాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదిక వివరాలను తరువాత ప్రకటిస్తాం" అని BCCI అధికారిక ప్రకటనలో పేర్కొంది.

భారతదేశ సాయుధ దళాల ధైర్యసాహసాలకు బీసీసీఐ మరోసారి సెల్యూట్ చేసింది. దేశం కోసం వారు చేసే పోరాటం ప్రజలను ప్రశాంతంగా ఉంచుతుంది. దేశంలో అంతా సజావుగా ఉండటానికి వారి కృషి కారణం. భారత బలగాల చర్యలతోనే బీసీసీఐ మిగిలిన ఐపీఎల్ లీగ్ పూర్తి చేయనుంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బోర్డు నడుచుకుంటుందని మరోసారి బోర్డు స్పష్టం చేసింది. 

For The Entire Updated Schedule, CLICK HERE

ఆసక్తికరంగా మారిన ప్లే ఆఫ్ రేసు

ఇప్పటివరకు IPL 2025లో, 3 జట్లు ప్లేఆఫ్ పోటీ రేసు నుంచి నిష్క్రమించాయి. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా మారింది, మాజీ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. 

ప్రస్తుత ఛాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ చివరి మ్యాచ్‌లో CSK చేతిలో ఓటమిని చవిచూశారు. దాంతో వారి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టతరం అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. వరుస విజయాలు సాధిస్తున్న ముంబై కూడా ప్లే ఆఫ్ రేసులో బెర్త్ కోసం చూస్తోంది.