Virat Kohli VS Rohit Sharma VS BCCI: భారత క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూల స్థంభాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.  అయితే రిటైర్మెంట్ విషయంలో వీరిద్దరూ ఒకేలా ఆలోచించారు. గతేడాది టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ తొలుత టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలుకగా, అదే వేదికపై రోహిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా టెస్టు క్రికెట్ విష‌యంలో కూడా వీరిద్ద‌రూ దాదాపు ఒకే స‌మ‌యంలో రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. ఈసారి ముందుగా రోహిత్ త‌న వీడ్కోలు నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌గా, ఆ త‌ర్వాత కోహ్లీ ఎమోష‌న‌ల్ పోస్టు ద్వారా త‌న అల్విదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. అయితే వీరిద్ద‌రి రిటైర్మెంట్ విష‌యంలో మాత్రం కాస్త తేడా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బీసీసీఐ ఈ విష‌యంలో ఇద్ద‌రి విష‌యంలో వేర్వేరుగా ప్ర‌వ‌ర్తించింద‌ని తెలుస్తోంది. 

రోహిత్ కు క్లియ‌ర్ మెసేజీ..గ‌త కొంత‌కాలంగా లాంగెస్ట్ ఫార్మాట్ లో విఫ‌ల‌మ‌వుతున్న రోహిత్ .. ఈనెల 7న బీసీసీఐతో సెలెక్ట‌ర్లు స‌మావేశ‌మైన సంద‌ర్భంగా త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించాడు. భార‌త అభిమానుల‌కు ఇది స‌డెన్ షాక్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. బోర్డర్ గావ‌స్క‌ర్ ట్రోఫీలో ఘోరంగా విఫ‌లమైన రోహిత్.. ఐదో టెస్టులో స్వ‌యంగా త‌ప్పుకున్నాడు. ఇక భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌లో రోహిత్ లేడ‌ని బోర్డు చెప్ప‌డంతో స్వ‌యంగా రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని త‌ను ప్ర‌క‌టించాడు. అంత‌టితో ఈ చ‌ర్చ ముగిసింది. 

 

కోహ్లీపై ఒత్తిడి..అయితే రోహిత్ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ప్పుడే కోహ్లీ కూడా త‌న వీడ్కోలు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. అయితే ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోమ్మ‌ని బీసీసీఐ కాస్త ఒత్తిడి చేసింద‌ని, అయితే బోర్డు మాట వినేందుకు కోహ్లీ స‌సేమిరా అని సోమ‌వారం తన నిర్ణ‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. అయితే రోహిత్, కోహ్లీకి కేవ‌లం ఒక్క ఏడాదే వ‌య‌సు అంత‌రం ఉండ‌టం, రోహిత్ విష‌యంలో ఒక‌లా, కోహ్లీ విష‌యంలో బోర్డు మ‌రోలా ప్ర‌వ‌ర్తించ‌డంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇద్ద‌రు దిగ్గ‌జాల టెస్టు కెరీర్ ఒకేనెల‌లో ముగియడంతో భార‌త అభిమానులు కాస్త విషాదంలో నిలిచారు. ఇక భార‌త సార‌థి రోహిత్ స్థానంలో టెస్టు కెప్టెన్ రేసులో అంద‌రి కంటే ముందుగా శుభ‌మాన్ గిల్ నిలిచాడు. ఐపీఎల్లో త‌న సార‌థ్యం బాగుండ‌టం, యువ‌కుడు, నిల‌క‌డైన ఆట‌తీరుతో త‌న‌కే జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. దీనిపై ఈనెల చివ‌రి వారంలో జ‌ట్టు ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా క్లారిటీ వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.