IPL 2025 Latest Updates: అర్ధాంతరంగా రద్దయిన ఐపీఎల్ తిరిగి స్టార్ట్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడొచ్చు. అయితే టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం షాక్ తగిలే అవకాశముంది. జట్టు స్టార్ పేసర్ మిగతా మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే భుజం గాయంతో టోర్నీలో ఒక్క మ్యాచ్ కు తను దూరమైన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తను బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే గాయం నుంచి తానింకా కోలుకోక పోవడంతోపాటు కొన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడటంతో ప్లే ఆఫ్స్ కు తను దూరమయ్యే అవకాశముందని తెలుస్తోంది. వచ్చేనెలలో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లో జరుగనున్న నేపథ్యంతో ముందు జాగ్రత్తగా తనను స్వదేశానికి ఆస్ట్రేలియా పిలిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గాయలబారిన పడి..నిజానికి గతేడాదిగా హేజిల్ వుడ్ గాయాలబారిన పడి ఉన్నాడు. గతంలో మోకాలి పిక్క, నడుం గాయం కారణంగా కొంతకాలం క్రికెట్ కు దూరమయ్యాడు. భారత్ తో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి కూడా తను దూరమయ్యాడు. ఈనేపథ్యంలో వచ్చేనెలలో సౌతాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో పాల్గొనడం తనకు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో గాయం మరింత ముదరకుండా తనను స్వదేశానికి రప్పించే అవకాశముంది. ఇక ఇప్పటికే నాకౌట్ రేస్ నుంచి దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న మిషెల్ స్టార్క్ కూడా మెగా మ్యాచ్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
లాజిస్టిక్ ఇష్యూస్..సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ కు అనుకోని గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఓవర్సీస్ ఆటగాళ్లు బ్రేక్ ఇచ్చిన 24గంటల లోపలే తమ దేశానికి వెళ్లి పోయారు. అలాగే సహాయక సిబ్బంది కూడా తమ కంట్రీలకు వెళ్లిపోయారు. వారు తిరిగి వచ్చి, ఆయా జట్లకు సేవలందించడం కాస్త కష్టంగా ఉంది. అయితే ఒకసారి షెడ్యూల్ ఖరారైన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతున్నాయి. ఢిల్లీకి నాకౌట్ చాన్స్ పుష్కలంగా ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్, డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం నాకౌట్ లో చోటు కోసం పోరాడుతున్నాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అవి టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. అలాగే సన్ రైజర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి ఔటయ్యాయి.