Ind Vs Eng Test Tour: టెస్టు క్రికెట్ నుంచి విరమించుకోవాలనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆలోచనను మార్చేందుకు బీసీసీఐ శతవిధాల ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అతనితో మాట్లాడగా, ససేమిరా అన్నట్లుగా సమాచారం. ఇప్పటికే రెండు వారాల కిందట తన ఆలోచనను సెలెక్టర్లతో పంచుకోగా, వారు షాకయ్యారని తెలుస్తోంది. సీనియర్ బ్యాటర్, తాజా కెప్టెన్ రోహిత్ సడెన్ గా తప్పుకోగా, ఇప్పుడు కోహ్లీ కూడా లేకపోతే, టీమిండియాకు ఇబ్బంది అవతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు బీసీసీఐ చాలా పలుకుబడి గల ఒక మాజీ క్రికెటర్ ను రంగంలోకి దించాలని బోర్డు భావిస్తోందని తెలుస్తోంది. గత రెండు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో రెండుసార్లు ఫైనల్ కు చేరిన భారత్.. రెండుసార్లు రన్నరప్ గానే నిలిచింది. అలాగే ఈసారి ఎడిషన్ లో మూడో స్థానంలో నిలిచి త్రుటిలో ఫైనల్ చాన్స్ మిస్సయ్యింది. ఈ సారి తప్పకుండా ఫైనల్ చేరాలనే కల నెరవేరాలంటే ఇంగ్లాండ్ పర్యటనలో రాణించడం తప్పనిసరి.
సుదీర్ఘ టూర్..రెండునెలలపాటు సాగే ఈ టూర్ లో ఐదు టెస్టులను టీమిండియా ఆడుతుంది. డబ్ల్యూటీసీ తుది పోరుకు చేరుకోవాలంటే ఈ సిరీస్ లో శుభారంభం చేయడం తప్పనిసరి. ఇప్పటికే హిట్ మ్యాన్ దూరమైన వేళ కోహ్లీ కూడా తప్పుకుంటే అనుభవం లేని టీమిండియా.. ఇంగ్లాండ్ లో తేలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ టూర్ కోసం కొనసాగాలని కోహ్లీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమచారం. ఇక గతేడాది నుంచి జట్టులో స్థానంపై పలుసార్లు కోహ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఘోరంగా విఫలం.. గతేడాది ద్వితీయార్థం టీమిండియా టెస్టు క్రికెట్ కు పీడకలగా మారిందనడలో ఎలాంటి సందేహం లేదు. బంగ్లాదేశ్ పై సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ను కష్టంతో గెలుచుకున్న భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఏకంగా సిరీస్ ను వైట్ వాష్ తో కోల్పోయింది. దశాబ్ధాలుగా ఒక్క టెస్టు నెగ్గని కివీస్ కు ఏకంగా టెస్టు సిరీస్ ను అప్పగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కంగారూలకు అప్పగించింది. ఆ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ల ఆటతీరుపై పలు విమర్శలు వచ్చాయి. ఐదో టెస్టులో ఏకంగా రోహిత్ ను పక్కన పెట్టారు. ఈక్రమంలో రోహిత్ తాజాగా రిటైర్ కాగా, కోహ్లీ ఆ దిశగా సాగుతున్నాడు. ఈనెల చివరివారంలో టెస్టు జట్టును ప్రకటించే నేపథ్యంలో ఈ విషయంపై స్పష్టత రానుంది. కీలకమైన ఇంగ్లాండ్ టూర్ కు కోహ్లీ ఉండాలని, ఈ సిరీస్ లో సత్తా చాటి ఘనంగా కెరీర్ ను ముగించాలని పలువురు ఆశిస్తున్నారు.