ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 అంకానికి తెరలేచింది. రాత్రి 8 గంటలకు మెదటిమ్యాచ్ ఆరంభంకానుంది. చెన్నైసూపర్‌కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా... ఈసాలా కప్ నమ్మదే అంటూ వస్తోన్న బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్ కి చెన్నై టీం మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా కాకుండా రుతురాజ్‌గైక్వాడ్ ని సారథిగా అనౌన్స్ చేశారు. ధోనీ కొన్ని రోజుల క్రితమే ఇన్‌డైరక్ట్ గా ఈ విషయాన్ని చెప్పినా మ్యాచ్‌కి కొన్ని గంటలముందు చెన్నై ఈ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అభిమానులు. ఇక మ్యాచ్ గెలిచేది ఎవరంటూ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చెన్నై, ఆర్సీబీ లలో ఎవరికి విజయావకాశాలుమెండుగా ఉన్నాయి.
రికార్డ్ ఇలా ఉంది
ఐపీయల్ లో తిరుగులేని టీం చెన్నై సూపర్‌కింగ్స్. టైటిల్ గెలవలేదు అనే ఒక్క కారణం తప్ప బలమైన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఇంత బలమైన టీంల మధ్య మ్యాచ్... అది కూడా సీజన్ తొలిమ్యాచ్ అంటే ఎలా ఉంటుంది. చిన్నపాటి యుద్ధమే కనిపిస్తుంది. ఇక రెండు జట్ల 31 మ్యాచ్‌లు జరిగితే చెన్నై 20 మ్యాచ్‌లు గెలిచింది. ఆర్సీబి 10 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రికార్డ్‌లు ఇలా ఉన్నాఈ సారి మాత్రం ఆట మరోలా ఉంటుందనేది బెంగళూరు మాట.
చెన్నై టీంలో ధోనీ, గైక్వాడ్, మొయిన్ ఆలీ, జడేజా, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ కీలక ఆటగాళ్లు కాగా కాన్వే, పతిరణ లేకపోవడం లోటని చెప్పొచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ , దినేశ్ కార్తీక్, కామెరూన్ గ్రీన్, సిరాజ్‌లను సూపర్ ప్లేయర్స్‌గా చెప్పొచ్చు. రెండుటీమ్‌లు మైదానంలో పులుల్లా తలపడతాయనడంలో సందేహంలేదు. ఎప్పటిలానే చెన్నై అన్నివిభాగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ, బెంగళూరు మళ్లీ బ్యాటింగ్ లైనప్‌నే నమ్ముకొంది. కాబట్టి చెన్నై బౌలర్లు బెంగళూరు బ్యాట్స్‌మెన్ పైనే ఫోకస్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
చెన్నై బలమంతా అతనే
ఇక మహేంద్రసింగ్‌ధోనీ కెప్టెన్సీ వదిలేసాడు కానీ, టీంలోనే కొనసాగుతాడు. కాబట్టి తన అమ్ములపొదిలోని వ్యూహాలు జట్టుకు అవసరమొచ్చినప్పుడు తీస్తాడు. ప్రస్తుత కెప్టెన్ గైక్వాడ్‌కు సహాయపడనున్నాడు. ఇక డిఆర్‌యస్ ని ధోని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకొంటాడో అందరికీ తెలిసిందే. బెంగళూరు ప్లేయ్లర్లతో ఇప్పటికే ఆడి ఉండటం, దాదాపు సొంత మైదానమైన చెపాక్ లో పరిస్థితులు కొట్టినపిండికావడం ధోనీయే చెన్నైకి ప్రధాన బలం. ఇక మిగిలిన ప్లేయర్లు తలా ఓ చెయ్యేస్తే బెంగళూరు పనిపట్టడం పెద్దకష్టమేం కాదు అని భావిస్తున్నారు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు.
బెంగళూరుకి ఆ ఒక్కటే భయం
మరోవైపు బెంగళూరు అంత తేలిగ్గామ్యాచ్ ఇచ్చేసే రకం కాదు. దెబ్బతిన్న పులిలా విజృంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు చెప్తున్నారు. తమ బ్యాటింగ్ లో డెప్త్ ఉన్న దృష్ట్యా దూకుడుగా ఆడేందుకే ఆర్సీబీ మొగ్గు చూపొచ్చు. జట్టు ప్రధాన బలం విరాట్ కోహ్లీపై ఎక్కువ ఆధారపడ్డా డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, కార్తీక్, గ్రీన్ లు ఎంత హార్డ్‌హిట్టర్ లో అందరికీ తెలుసు. ఇక వీళ్లల్లో ఒక్కరు నిలిచినా లక్ష్యం కరిగిపోవడం ఖాయం. అలాగే మెదట బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యం నిర్దేశించడమే పనిగా ఆడగలరు. కానీ, ఈ మైదానంలో కోహ్లీకి పెద్దగా రికార్డ్ లేకపోవడం. బెంగళూరు కి అంతగా అచ్చొచ్చిన మైదానం కాకపోవడంతో ఆర్సీబీ అభిమానులు కొద్దిగా కలవరానికి గురవుతున్నారు.
పిచ్ ఎలాఉంది అంటే
మరోవైపు చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మెదట బ్యాటింగ్‌కి అనుకూలించే అవకాశాలున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకొనే అవకాశముంది. అలాగే ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాలి కాబట్టి ఒత్తిడి కూడా ఇక్కడ జట్టు విజయంలో కీలకం అని చెప్పొచ్చు. ఈసారి ఒత్తిడి ఎక్కువగా బెంగళూరుపై కనిపిస్తోంది. ఆర్సీబీ అమ్మాయిలు విమెన్ టైటిల్ సాధించడం, కప్‌కోసం మేం కూడా చేయాల్సిందంతా చేస్తాం అని కోహ్లీ అనడాన్ని బట్టి చూస్తే మ్యాచ్ లో విజయంకోసం సర్వశక్తులూ ఒడ్డే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు చెపాక్ మైదానం ఇప్పటికే పసుపుమయమైంది. చెన్నై అభిమానులు మ్యాచ్ జరిగే స్టేడియం వద్దకు చేరుకొంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు కూడా స్టేడియంకు చేరుకొంటున్నారు. 8 గంటలకు ప్రారంభం కానున్న 2024 సీజన్ తొలిమ్యాచ్‌లో ఎవరు గెలిచినా టైటిల్ వేటలో వాళ్లు పంపే సిగ్నల్స్ చాలా బలంగా ఉంటాయనేది మాత్రం చాలా క్లియర్.