Keshav Maharaj Offered Prayers At Ram Temple In Ayodhya Uttar Pradesh: దక్షిణాఫ్రికా(South African)కు చెందిన వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్(Keshav Maharaj ) అయోధ్య  శ్రీరాముని  దర్శించుకున్నాడు. ఈ విషయాన్ని అనంతరం ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 2024 ఐపీఎల్‌లో పాల్గొనేందుకు కేశవ్ ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు (Lucknow Super Giants) ప్రాతినిధ్యం వహించనున్నాడు. గతేడాది కూడా వన్డే వరల్డ్​కప్​ సమయంలో భారత్​కు వచ్చిన కేశవ్ కేరళలోని పలు ఆలయాలు, అప్పట్లో తిరువనంతపురంలోని ప్రముఖ దేవాలయం పద్మనాభస్వామి మందిరాన్ని సందర్శించాడు.


అయోధ్యలో రామమందిర  ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్‌(Keshav Maharaj) అప్పట్లో సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశ  వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.  రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.  


పూర్వీకులు భారతీయులే...


కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. కేశవ్ తండ్రి ఆత్మానందం కూడా క్రికెట్ ఆడినా వర్ణవివక్ష కారణంగా ఎదగలేకపోయాడు. తొలి నాళ్లలో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ అయిన కేశవ్.. తర్వాత స్పిన్నర్ అవతారం ఎత్తాడు. 2016లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత టీ20ల్లోకి అడుగుపెడుతూనే సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేశవ్ దక్షిణాఫ్రికాలోనే పుట్టిపెరిగినప్పటికీ.. హిందూ సంప్రదాయాలను పాటిస్తాడు. హనుమాన్ భక్తుడైన అతడి బ్యాట్‌పై ఓం గుర్తు ఉంటుంది. అతడి భార్య లెరీసాకు కూడా భారత మూలాలు ఉన్నాయి. ఆమె కథక్ డ్యాన్సర్ కూడా. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరాముని పాటలు వినిపించాయి. అప్పుడు కేశవ్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు మైదానంలోకి దిగినా ఇలాంటి పాటలు వినిపించేలా చేశారని ఆనందం వ్యక్తం చేశాడు. 

 

ఇక కేశవ్ మహారాజ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా తరఫున 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించిన మహరాజ్ ఈ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ క్యాంపులో కనిపించడం విశేషం. కేశవ్​తోపాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్, లఖ్​నవూ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఇతర సిబ్బంది కూడా బాలక్ రామ్​ను దర్శించుకున్నారు.