MS Dhoni CSK Captaincy IPL 2024: కొంతమంది ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ల ట్రూ క్యారెక్టర్ ను వదులుకోరు. కోట్లాది మందికి ఆరాధ్య క్రికెటర్ గా, వ్యక్తిగా ఉన్న ఎంఎస్ ధోనీ కూడా అంతే. ధోనీ ట్రూ క్యారెక్టర్ లో ఒక లక్షణం ఏంటో తెలుసా... తన చుట్టూ ఎంత మార్కెటింగ్, ప్రమోషన్స్, బ్రాండ్ వేల్యూ వంటి డీలింగ్స్ జరిగినా సరే తన పని తను చేసుకుంటూ పోతాడు. తనకు అనిపించిందే చేస్తాడు. అందులో భాగమే... తన క్రికెటింగ్ కెరీర్ లో ఈ 5 సడెన్ నిర్ణయాలపై ఓ లుక్కేయండి.
నంబర్ వన్. 30 డిసెంబర్ 2014. అప్పటికే ధోనీ 90 టెస్టులు ఆడాడు. అందులో దాదాపు సగం కెప్టెన్ కూడా. హాయిగా ఇంకో పది టెస్టులు ఆడేసుకోవచ్చు. వంద టెస్టుల మైలురాయి చేరుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా టూర్ నడుస్తుండగానే మధ్యలోనే విరాట్ కు బాధ్యతలు అప్పగించాడు. టెస్టుల్లో ఇక తన ఫిట్ అవనని స్వయంగా గ్రహించాడేమో. బ్యాటన్ స్మూత్ గా పాస్ చేశాడు.
నంబర్ 2: 4 జనవరి 2017. వన్డే,టీ20 కెప్టెన్సీ మళ్లీ విరాట్ కు అప్పగించిన రోజు. లిమిటెడ్ ఓవర్స్ లో ధోనీ అప్పటికీ ప్రమాదకర ఆటగాడే. కానీ కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడు. మళ్లీ జట్టు కోసమే. 2019 ప్రపంచకప్ కు ఇంకో రెండేళ్లే ఉందన్న దృష్టితో కొత్త కెప్టెన్ కు సర్దుకోవడానికి టైం ఇవ్వాలని గ్రహించి ముందుగానే బాధ్యతలు వదులుకున్నాడు.
నంబర్ 3: ఆగస్ట్ 15 2020. కరోనా నుంచి సురక్షితంగా ఎలా ఉండాలా అని అందరూ చూస్తున్న రోజులు.సైలంట్ గా మరో బాంబ్ పేల్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్. వరల్డ్ కప్ రనౌట్ తర్వాత ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. రిటైర్మెంట్ కూడా ఆర్భాటం ఏమీ లేదు.మై పల్ దో పల్ కా షాయర్ హూ... ఓ పాట యాడ్ చేసి ఓ వీడియో వదిలాడు. 1929 నిమిషాలకు నేను రిటైర్ అయినట్టు భావించండన్నాడు. అంతే
నంబర్ 4: మార్చ్ 24 2022. తొలిసారిగా సీఎస్కే కెప్టెన్సీ వదిలేశాడు. ఈసారీ సడన్ నిర్ణయమే. రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కానీ తప్పని పరిస్థితుల్లో సీజన్ మధ్యలో కెప్టెన్సీ మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది.
నంబర్ 5: మార్చ్ 21 2024. అంటే ఇవాళ. రెండోసారి కెప్టెన్సీ వదిలేశాడు. కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. దాదాపుగా ఆటగాడిగా కూడా ఇదే ఆఖరు సీజన్ కావొచ్చు. రుతురాజ్ ను దగ్గరుండి చూసి, నేర్పించాల్సినవి నేర్పించి.... రిటైర్ అయిపోతాడేమో. అది కూడా ఎలాంటి హంగులూ లేకుండానే అవొచ్చేమో. ఎందుకంటే ధోనీ అంటే అంతే కదా. అతను అలానే ఉంటాడు. అదే చేస్తాడు