Virat Kohli May Attend Mumbai Indians vs Delhi Capitals Vouches to Support Rohit Sharma: ఆర్సీబీ మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ (MI vs DC) పోరుకు హాజరవ్వనున్నాడు. వాంఖడే మైదానంలో ప్రత్యక్షంగా ఈ మ్యాచును వీక్షించాలని అనుకుంటున్నాడు. గ్యాలరీలో కూర్చొని రోహిత్‌ సేనను ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు తెలిసింది.


ఐపీఎల్‌ 2022 ఆఖరి స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్‌ చేరుకున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో స్థానం రేసులో నిలిచింది. మరో ప్లేస్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీపడుతున్నాయి.


గుజరాత్‌పై విక్టరీతో ఆర్సీబీ 16 పాయింట్లు సాధించింది. అయితే నెగెటివ్‌ రన్‌రేట్‌ (-0.253) వారికి గండంగా మారింది. అందుకే శనివారం ముంబయి ఇండియన్స్‌ చేతిలో దిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోవాలని కోరుకుంటోంది. ప్రస్తుతం పంత్ సేన 13 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. +0.255 రన్‌రేట్‌ ఉండటం వారికి ఊపిరి పోస్తోంది. ఒకవేళ హిట్‌మ్యాన్‌ సేన చేతిలో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుకొనేందుకు ఇది దన్నుగా మారనుంది.


ఈ నేపథ్యంలో వాంఖడేలో శనివారం జరిగే ముంబయి, దిల్లీ పోరుకు వస్తానని విరాట్‌ కోహ్లీ పరోక్షంగా సూచించాడు. డుప్లెసిస్‌తో ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు. 'ఓ రెండు రోజులు సరదాగా ఉండాలని అనుకుంటున్నాం. ముంబయి ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నా. ముంబయికి మా రూపంలో మరో ఇద్దరు సపోర్టర్స్‌ దొరికారు. కాదు.. కాదు.. 25 మంది ఎక్కువ దొరికారు' అని డుప్లెసిస్‌తో కోహ్లీ అన్నాడు. 'బహుశా మీరు మమ్మల్ని స్టేడియంలోనూ చూడొచ్చు' అని పేర్కొన్నాడు. అదే సమయంలో డుప్లెసిస్‌ 'ముంబయి.. ముంబయి' అంటూ నినాదాలు చేస్తూ అలరించాడు.




ఏదేమైనా గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులో విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం ఫ్యాన్స్‌లో సంతోషం నింపింది. ఛేదనలో విరాట్‌ 54 బంతుల్లోనే 73 పరుగులు సాధించాడు. 'నేనెప్పుడూ ఇలాగే ముందుకు సాగుతాను. ఇది మాకు కీలకమైన మ్యాచ్‌. ఈ సీజన్లో నా జట్టు కోసం ఎక్కువగా చేయలేకపోయినందుకు బాధపడ్డాను. ఈ మ్యాచులో మా జట్టు కోసం నేను ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గెలుపుతో మేం మెరుగైన స్థితిలో నిలిచాం. ఇంతకు ముందు బాగా ఆడటంతో ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఏదేమైనా మన దృక్పథం బాగుండాలి. అంచనాలు అందుకొనేందుకు పరుగెడితే ప్రాసెస్‌ను మర్చిపోవాల్సి ఉంటుంది. నేనెంతో శ్రమించాను. ముందురోజు నెట్స్‌లో 90 నిమిషాలు కష్టపడ్డాను. ఇప్పుడు నేనెంతో ఫ్రీగా, హాయిగా ఉన్నాను' అని కోహ్లీ అన్నాడు.