SRH News: సన్ రైజర్స్ హైదరాబాద్, హెచ్ సీఏ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ వివాదంపై తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు తెలిశాయి. హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయని స‌మాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపిన‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్ అద‌న‌పు టికెట్ల కేటాయింపు  వ్యవహారంలో విచారణ జరిగిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ సెక్రటరీ జగన్మోహన్ రావు స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయిన‌ట్లు తెలుస్తోంది. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు స‌మాచారం. నిజానికి ఇప్పటికే ప్ర‌తి మ్యాచ్ కు సంబంధించి పది శాతం టికెట్లను ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రీగా ఇస్తోంది. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ ఒత్తిడి తెచ్చినట్లు ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపించింది..

 టికెట్ల కోసం బెదిరింపులు..

ఇక నిబంధ‌న‌ల‌కు మించి ఫ్రీగా 10 శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్‌హెచ్ యజమాన్యం తేల్చి చెప్పగా, ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారని తెలుస్తోంది. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్ల‌డైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ల సందర్భంగా ఫ్రాంచైజీని సెక్ర‌ట‌రీ.. ఇబ్బందుల గురిచేశారు . లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు కూడా వేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ను హెచ్ సీఏ పెద్ద‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ అయింది. కాగా.. హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ ఆదేశించగా, తాజాగా విచార‌ణ పూర్త‌యి, నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. 

అసలు వివాదం ఏంటి..?పాసుల విష‌యంలో హెచ్ సీఏ ఇబ్బందులు పెడుతున్న‌ట్లు ఫ్రాంచైజీ వ‌ర్గాలు ఆరోప‌ణలు చేశాయి. ఇందుకు సంబంధించిన ఒక మెయిల్ కూడా బ‌హిర్గ‌త‌మైంది. అలాగే, పాసుల కోసం హెచ్‎సీఏ తమను బెదిరింపులకు గురి చేసిందని SRH యాజమాన్యం సంచలన ఆరోపించింది.  పాసులు ఇవ్వకపోతే స్టేడియంలోని కొన్ని బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని పేర్కొంది.. ఇలాగైతే త‌మ వల్ల కాదని.. తాము వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్‎సీఏకి  స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మేనేజ్మెంట్‎ లేఖ రాసింది. దీంతో ప్ర‌భుత్వం వేగంగా స్పందించి, న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించగా, తాజాగా విచారణ పూర్తై, నివేదికను ప్రభుత్వానికి అందడంలో పలు విషయాలు బహిర్గతం అయ్యాయి..