IPL 2025 RCB Reaches Qualifier 1 by beating LSG: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్భుతం చేసింది. బౌలింగ్ లో విఫలమైనా, అద్భుతమైన బ్యాటింగ్ తో తమ కెరీర్ లో రికార్డు ఛేజింగ్ ను చేసి, క్వాలిఫయర్1లో చోటు సంపాదించింది. లక్నోలో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో దుమ్ము రేపింది. కెప్టెన్ రిషభ్ పంత్ సూపర్ అజేయ సెంచరీ (61 బంతుల్లో 118 నాటౌట్, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) తో శివ తాండవం ఆడి, సీజన్ ను చాలా హైగా ముగించాడు. నువాన్ తుషారా ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం ఆర్సీబీ.. ఛేజింగ్ ను 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 230 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జితేశ్ శర్మ సూపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 85 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తో కీలకదశలో ధనాధన్ ఆటతీరుతో మ్యాచ్ ను టర్న్ చేశాడు. బౌలర్లలో విలియం ఓ రౌర్క్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
పంత్ వన్ మేన్ షో..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మథ్యూ బ్రీట్జ్కే (14) విఫలమయ్యాడు. అయితే మిషెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు )తో కలిసి పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఫుల్ జోష్ లో ఆడి ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో పవర్ ప్లేలో 55 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ జోరు కొనసాగించారు. 29 బంతుల్లో పంత్, 35 బంతుల్లో మార్ష్ ఫిఫ్టీ చేశాడు. ఈక్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 152 పరుగుల రికార్డు స్థాయిలో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్ష్ ఔటయిన పంత్ జోరు కొనసాగించి, 54 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ టోర్నీలో పంత్ కిది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక నికోలస్ పూరన్ (13) వేగంగా ఆడలేక పోవడంతో అనుకున్నంత భారీ స్కోరును లక్నో సాధించ లేకపోయింది.
సూపర్ భాగస్వామ్యం..228 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 54, 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (30) శుభరంభాన్నిచ్చారు. 11.5 పరుగుల రన్ రేట్ తో పరుగుల చేయాల్సి ఉండగా.. అంతకంటే వేగంగానే వీరిద్దరూ రన్స్ కొట్టడంతో ఆర్సీబీకి వేగంగా పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో 66 పరుగులు వచ్చాయి. అయితే తొలి వికెట్ కు 61 పరుగులు జోడించాక, సాల్ట్ ఔటయ్యాడు. ఆ తర్వాత రజత్ పతిదార్ (14), లియామ్ లివింగ్ స్టన్ డకౌట్ తో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో ఆర్సీబీ ఒత్తిడిలో పడింది. ఈ దశలో మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్) తన క్లాస్ చూపించాడు. క్రీజులో పాతుకుపోయి, ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే 27 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక కోహ్లీ ఔట్ కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన స్టాండింగ్ కెప్టెన్ జితేశ్ తన విలువను మరోసారి చాటాడు. తీవ్ర ఉత్కంఠ నెలకొన్నదశలో ధనాధన్ ఆటతీరుతో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి కేవలం 22 బంతుల్లోనే జితేశ్ ఫిఫ్టీ చేశాడు. దీంతో ఒత్తిడంతా తొలిగి పోయింది. అలా టార్గెట్ ను కరిగిస్తూ వీరిద్దరూ బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ కాస్త సునాయస విజయాన్ని అందించారు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కు అబేధ్యంగా 107 పరుగులు జోడించారు. ఈ ఫలితంతో ఆర్సీబీ.. క్వాలిఫయర్ 1కి అర్హత సాధించి, ఈనెల 29న పంజాబ్ కింగ్స్ తో చంఢీగర్ లో పోరుకి సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోవడంతో గుజరాత్ ఎలిమినేటర్ కు అర్హత సాధించింది. ఈనెల 30న ముంబైతో చంఢీఘర్ లోనే జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.