Venkatesh Iyer Comments: ఐపీఎల్లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాళ్ల‌లో ఒక‌రు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కి చెందిన వెంకటేశ్ అయ్య‌ర్.. గ‌తేడాది ఐపీఎల్ టైటిల్ సాధించ‌డంలో త‌ను కీల‌క‌పాత్ర పోషించాడు. బ్యాట్ తో మెరుపులు మెరిపించ‌డంతోపాటు, బౌలింగ్ లోనూ ఒక చేయి వేయ‌గ‌ల సిస‌లైన ఆల్ రౌండ‌ర్ త‌ను. అందుకే రూ.23.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కేకేఆర్ అత‌డిని కొనుగోలు చేసింది. రిష‌భ్ పంత్ (రూ.27 కోట్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (రూ.26.75 కోట్లు) త‌ర్వాత అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా త‌ను నిలిచాడు. ప్ర‌జెంట్ కేకేఆర్ కెప్టెన్ గా వెట‌ర‌న్ అజింక్య ర‌హానేను ప్ర‌క‌టించినా, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్ ను  వైస్ కెప్టెన్ గా నియ‌మించారు. ఇక గ‌తంలో కెప్టెన్సీకి సంబంధించి చెన్నై సూప‌ర్ కింగ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ |ధోనీ నుంచి 2023లో త‌ను నేర్చుకున్న విష‌యాన్ని వెంక‌టేశ్ పంచుకున్నాడు. 

ధోనీ మాస్ట‌ర్ మైండ్స్..చెన్నైతో మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు ఒక ఫీల్డ‌ర్ స్థానాన్ని మార్చి త‌న‌ను ఔట్ చేసిన‌ట్లు వెంక‌టేశ్ తెలిపాడు. నిజానికి ఆ మ్యాచ్ లో 4 బంతుల్లో 9 ప‌రుగులు చేసిన త‌ను.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్ తో త‌ర్వాతి బంతి కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపాడు. అయితే ఇంత‌లో డీప్ స్క్వేర్ లెగ్ లో ఉన్న ప్లేయ‌ర్ ను మార్చి, అత‌డి స్థాన్నాని షార్ట్ థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా పెట్టాడని పేర్కొన్నాడు. అది కూడా కొంచెం ఎడంగా పెట్టిన‌ట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ త‌ర్వాతి బంతికే త‌ను నేరుగా ఆ ఫీల్డ‌ర్ చేతిలోకి బంతిని కొట్టి ఔటైన‌ట్లు పేర్కొన్నాడు. మ్యాచ్ త‌ర్వాత ధోనీతో ఈ విష‌యంపై సంప్ర‌దింపులు జ‌రిపాన‌ని, ధోనీ చెప్పిన విష‌యం విని త‌ను షాక్ కు గురైన‌ట్లు తెలిపాడు. 

అంచ‌నా వేసి..అప్ప‌టికే త‌న బ్యాటింగ్ పై ఒక అంచ‌నాకు వ‌చ్చిన ఎంఎస్ ధోనీ.. ఫీల్డింగ్ లో మార్పులు చేసిన‌ట్లు మ్యాచ్ ముగిసిన అనంత‌రం త‌న‌తో చెప్పిన‌ట్లు వెంక‌టేశ్ పేర్కొన్నాడు. త‌ను బంతిని కొడుతున్న విధానం, యాంగిల్ ను చూసి, ఫీల్డ‌ర్ ను అక్క‌డ మోహ‌రించిన‌ట్లు వెల్ల‌డించాడు. అప్ప‌టికే ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే రీప్లేలో కెమెరాల్లో ప్ర‌సారం అవుతుంద‌ని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి బ్యాట‌ర్ల బ‌లానికి అనుగుణంగా ఫీల్డ‌ర్ల‌ను పెట్టి, ధోనీ పై చేయి సాధించిన‌ట్లు వెంక‌టేశ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ఈనెల 22 నుంచి ప్రారంభం అవుతుండ‌గా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ గా కేకేఆర్ బ‌రిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగే ఈ మ్యాచ్ లో మూడుసార్లు ఫైన‌లిస్టు.. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో త‌ల‌ప‌డ‌నుంది. తర్వాతి రోజు హైదరాబాద్ కు చెందిన ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. ఉప్పల్ మైదానంలో జరిగే  ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనున్నారు. అలాగే అదే రోజు చెన్నై తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చు కోనుంది.