The journey of Gujarat Titans in IPL 2024: ఐపీఎల్(IPL)లో అత్యంత విజయవంతైమన జట్టుగా ఉన్న గుజరాత్ టైటాన్స్(GT)...ఈసారి కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకోకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 2022 సీజన్‌లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్... మొదటి సీజన్‌లోనే అదరగొట్టింది. హార్దిక్ పాండ్యా(Hardic Pandya) సారథ్యంలో తొలిసారే ఐపీఎల్ టైటిల్‌ను ఒడిసిపట్టి చరిత్ర సృష్టించింది. 2022 సీజన్ ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2023 సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ ఆకట్టుకుంది. ఆ సీజన్‌లోనూ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన గుజరాత్... ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో పరాజయం పాలైనా అద్భుత పోరాటంతో ఆకట్టుంది. 2023 సీజన్ మొత్తం సాధికార ఆటతీరుతో గుజరాత్ ముందుకు సాగింది. హార్దిక్ పాండ్యా జట్టును గొప్పగా ముందుకు నడిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వీడి ముంబై(MI) పంచన చేరడం.. మహ్మద్ షమీ గాయంతో దూరం కావడం... గిల్(Gill) తొలిసారి సారధ్య బాధ్యతలు స్వీకరిచడం సహా కొన్ని అవరోధాలతో ఈసారి కప్పు లేకుండానే గుజరాత్ వెనుదిరిగింది. ప్లే ఆఫ్‌కు అయినా చేరాలన్న గుజరాత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
IPL 2024: తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరకుండా, గుజరాత్ పతనం సాగిందిలా
ABP Desam
Updated at:
15 May 2024 11:28 AM (IST)
Edited By: T Gowtham
Gujarat Titans: ఈసారి కప్పు లేకుండానే గుజరాత్ వెనుదిరిగింది. ప్లే ఆఫ్‌కు అయినా చేరాలన్న గుజరాత్ ఆశలపై చివరికి వరుణుడు కూడా నీళ్లు చల్లాడు.
తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరకుండా వెనుదిరిగిన గుజరాత్( Image Source : Twitter )
NEXT
PREV
మూడో జట్టుగా గుజరాత్
ఐపీఎల్ సీజన్ 2024లో ప్లే ఆఫ్‌కు చేరకుండా వెనుదిరిగిన మూడో జట్టుగా గుజరాత్ నిలిచింది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్ బాధతో ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది. మే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 13 మ్యాచులు ఆడిన గుజరాత్ కేవలం అయిదు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే రద్దైంది. దీంతో కేవలం 11 పాయింట్లతో ఉన్న గుజరాత్ ఐపీఎల్ నుంచి ప్లే ఆఫ్ చేరకుండానే వెనుదిరిగింది. ఈ సీజన్‌ను గుజరాత్ సానుకూలంగా ప్రారంభించింది. కానీ ఆ సానుకూలతను టోర్నీ మొత్తం కొనసాగించడంలో విఫలమైంది. ఈ మెగా టోర్నీలో గుజరాత్ వరుస పరాజయాలతో సతమతమైంది.
అందరికీ అభినందనలు
ఈ సీజన్‌లో తమకు మద్దతు ఇచ్చినందుకు అభిమానులకు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. మే 16న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్‌పై గెలిచినా గుజరాత్‌కు కేవలం 13 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. మరోవైపు ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా మిగిలిన రెండు స్థానాల కోసం అయిదు జట్లు పోరాడుతున్నాయి. హైదరాబాద్, చెన్నైకు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన జట్లకూ అవకాశాలు ఉన్నాయి.
Published at:
15 May 2024 11:28 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -