Sachin vs SKY: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ తమ ఫ్రాంచైజీ తరపున ఒక అత్యద్భుత రికార్డును నమోదు చేశాడు. 18 ఏళ్ల లీగ్ చరిత్రలో ముంబై తరపున ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. దీంతో 15 ఏళ్ల కిందట మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును తను తిరగరాశాడు. 2010 సీజన్లో తను 5 ఫిఫ్టీలతో 618 పరుగులు సాధించాడు. గత 15 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్య.. సునాయసంగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. సోమవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన సూర్య.. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి 640 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 168.54 కావడం విశేషం. అలాగే తన ఐపీఎల్ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2023లో ముంబై తరపున 605 పరుగులు సాధించి, సచిన్ రికార్డును త్రుటిలో కోల్పోయాడు.
మరింతగా చాన్స్.. ముంబై ఇప్పటికే నాకౌట్ చేరడంతో సూర్య ముందట మరో రికార్డు ఊరిస్తూ ఉంది. ఐపీఎల్ చరిత్రలో 700 పరుగులు చేసిన మూడో భారత ప్లేయర్ గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ రెండుసార్లు (2016, 2024), శుభమాన్ గిల్ (2022)లో మార్కును చేరుకున్నారు. ప్లే ఆఫ్ లో మరో 60 పరుగులు సాధిస్తే, ఈ మార్కును సూర్య చేరుకుంటాడు. ఇది జరగాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గత సీజన్ లో అట్టడుగున నిలిచిన ముంబై.. ఈ సీజన్ లో అద్భుతంగా పుంజుకుని, ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
ప్రపంచ రికార్డు బ్రేక్.. ఈ మ్యాచ్ లో సూర్య పొట్టి ఫార్మాట్ లో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. వరుసగా 14వ సారి 25+ పరుగులు చేసి, టెంబా బవూమా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 57 పరుగుల ఇన్నింగ్స్ తో సూర్య కుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆరంభంలో ఓపికగా ఆడిన సూర్య, తర్వాత సత్తా చాటి, అద్భుతమైన అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. వరుసగా 14 సార్లు 25+ స్కోర్లు చేసి పొట్టి ఫార్మాట్ లో తన వాడిని చూపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.