IPL 2025 SRH 6th Win:  స‌న్ రైజ‌ర్స్ రెచ్చిపోయింది. అభిమానుల అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా ఈ మ్యాచ్ లో స‌త్తా చాటిన మాజీ చాంపియ‌న్.. డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడర్స్ పై 110 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ సీజ‌న్ లో ఆరో విజయంతో సీజ‌న్ ను ముగించింది.

 టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల‌కు 278 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' హెన్రిచ్ క్లాసెన్ వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కి దిగి, అద్భుత అజేయ సెంచ‌రీ ( 39 బంతుల్లో 105 నాటౌట్, 7 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) తో దుమ్ము రేపాడు. బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ రెండు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అనంత‌రం కొండంత టార్గెట్ తో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ మ‌నీశ్ పాండే (23 బంతుల్లో 37,2 ఫోర‌్లు, 3 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. హ‌ర్ష్ దూబే, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా మూడేసి వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ ఫ‌లితంతో సీజ‌న్ లో ఆరో విజయాన్ని స‌న్ రైజ‌ర్స్ సాధించి, ప‌ట్టిక‌లో 6వ‌ స్థానానికి ఎగ‌బాకింది. 

దంచుడే దంచుడు..ఇప్ప‌టికే ఇరుజ‌ట్లు ప్లే ఆఫ్ రేసుకు దూరం కావ‌డంతో భారీ స్కోరే టార్గెట్ గా బ‌రిలోకి దిగాయి. ఇక ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ కి ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ (16 బంతుల్లో 32, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76, 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) ఆక‌ట్టుకున్నారు. తొలి ఓవ‌ర్లో రెండు ప‌రుగులు వ‌చ్చిన త‌ర్వాత ఓపెన‌ర్లు వీర‌విహారం చేశారు. ఇరు ఆట‌గాళ్లు రెండు వైపులా క‌మ్ముకు రావ‌డంతో కేకేఆర్ బౌల‌ర్లు నిస్స‌హాయంగా మారిపోయారు. భారీగా బౌండ‌రీలు బాద‌డంతో 41 బంతుల్లోనే 92 ప‌రుగులు జ‌త‌య్యాయి. స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో అభిషేక్ ఔటైనా.. హెడ్ త‌న ట్రేడ్ మార్కు షాట్ల‌తో రెచ్చిపోయి, 26 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఇక హిట్టింగ్ కోస‌మే వ‌న్ డౌన్ లో వ‌చ్చిన క్లాసెన్ త‌న మార్కును చూపెట్టాడు. ఆరంభం నుంచే దంచుడే దంచుడు మొద‌లు పెట్టాడు. వీరిద్ద‌రూ చాలా వేగంగా ప‌రుగులు సాధించడంతో స్కోరు బోర్డు ప‌రుగులెత్తింది. మ‌ధ్య‌లో హెడ్ ఔటైనా.. క్లాసెన్ మాత్రం.. త‌గ్గేదేలే అంటూ చెల‌రేగి పోయాడు. ఇషాన్ కిష‌న్ (29) నెమ్మ‌దిగా ఆడి, యాంక‌ర్ ఇన్నింగ్స్ తో స్ట్రైక్ రొటేట్ చేయ‌గా, క్లాసెన్ మాత్రం.. 17 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి, సెంచ‌రీ వైపుగా దూసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ఆడిన మ‌రో 20 బంతుల్లోనే సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టోర్నీలో మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచ‌రీని న‌మోదు చేశాడు.  చివ‌ర్లో అనికేత్ వ‌ర్మ (12 నాటౌట్) కూడా ఒక చేయి వేయ‌డంతో టోర్నీలో మూడో అత్య‌ధిక స్కోరును స‌న్ రైజ‌ర్స్ సాధించింది. ఈ టోర్నీలో టాప్-5 స్కోర్ల‌లో నాలుగు స‌న్ రైజ‌ర్ వే కావ‌డం విశేషం. 

కేకేఆర్ బెంబేలు..రికార్డు బ్రేకింగ్ ఛేజింగ్ అవ‌స‌ర‌మైన స్థితిలో బ్యాటింగ్ మొద‌లు పెట్టిన కేకేఆర్ కు శుభారంభం ద‌క్క‌లేదు. ఆరంభంలోనే ఓపెన‌ర్లు సునీల్ న‌రైన్ (31), క్వింట‌న్ డికాక్ (9), కెప్టెన్ అజింక్య ర‌హానే (15), అంగ్ క్రిష్ ర‌ఘువంశీ (14),రింకూ సింగ్ (9), అండ్రూ ర‌సెల్ డ‌కౌట్ కావ‌డంతో 95 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది. చివ‌ర్లో మ‌నీశ్ పాండే మూడు సిక్స‌ర్లు బాద‌డంతో కేకేఆర్ కి ఓట‌మి అంత‌రం త‌గ్గింది. ఈ విజ‌యంతో కేకేఆర్ పై ఎట్ట‌కేల‌కు ఓ విజ‌యం సాధించింది. గ‌త ఐదు మ్యాచ్ ల్లో కేకేఆర్ చేతిలో ఓడిన స‌న్.. ఈ మ్యాచ్ లో మాత్రం విజ‌యం సాధించి, ప‌రాజ‌య పరంప‌ర‌కు అడ్డుక‌ట్ట వేసింది. అలాగే తమ కెరీర్లో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.  ఈ మ్యాచ్ త‌ర్వాత టోర్నీలో త‌మ ప్ర‌స్థానాన్ని స‌న్, కేకేఆర్ ముగించాయి.