IPL 2025 CSK 4TH Win: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బోల్తా కొట్టింది. టేబుల్ టాపర్, బాటమ్ జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై విజయం సాధించింది. ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై 83 పరుగులతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 230 పరుగులు చేసింది. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రివిస్ స్టన్నింగ్ ఫిఫ్టీ (23 బంతుల్లో 57,4 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ కు రెండు వికెట్లు దక్కాయి. రికార్డు ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ ఒత్తిడికి తట్టుకోలేక 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ ( 28 బంతుల్లో 41, 6 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటి, పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో క్వాలిఫయర్ 1లో ఆడాలనుకున్న గుజరాత్ కు షాక్ తగిలింది. ఇప్పుడు మిగతా జట్ల ఫలితాలపై గుజరాత్ ఆడనుంది.
సమష్టి ప్రదర్శన..ఈ సీజన్ లో బ్యాటింగ్ వైఫల్యంతో తమ చరిత్రలో తొలిసారి బాటమ్ ఆఫ్ ద టేబుల్ గా నిలిచిన చెన్నై.. ఈ మ్యాచ్ లో జూలు విదిల్చింది. బ్యాటర్లంతా తలో చేయి వేయడంతో చెన్నై భారీ స్కోరు సాధించింది. ఆరంభంలోనే ఓపెనర్లు ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 34, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) , డేవన్ కాన్వే (35 బంతుల్లో 52, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో తొలి వికెట్ కు 44 పరుగులు జమయ్యాయి. ఆ తర్వాత ఊర్విల్ పటేల్ (37) కూడా బ్యాట్ ఝళిపించాడు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో రెండో వికెట్ కు వీరిద్దరూ 63 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో కాన్వే 34 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని ఔటయ్యాడు. చివర్లో బేబీ ఏబీగా పేరుగాంచిన బ్రివిస్ బౌండరీల వర్షంతో చెన్నైకి ఊహించని భారీ స్కోరు అందించాడు. తను 19 బంతుల్లోనే ఫిఫ్టీ చేయడంతో చెన్నై 230 పరుగుల స్కోరును దాటింది. రవీంద్ర జడేజా (21 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు.
అరుదైన వైఫల్యం..ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన జట్లు.. క్వాలిఫై అయిన జట్లకు షాకిచ్చే సంప్రదాయన్ని చెన్నై కూడా పాటించింది. ఈ మ్యాచ్ లో ఆరంభంలోనే బౌలర్లు చెలరేగి, వికెట్లు తీసి గుజరాత్ ను కట్టడి చేసింది. ముఖ్యంగా టాప్-త్రీలో కీలకమైన కెప్టెన్ శుభమాన్ గిల్ (13), జోస్ బట్లర్ (5) వికెట్లను త్వరగా తీసి గుజరాత్ నడ్డి విరిచింది. ఓ ఎండ్ లో సుదర్శన్ పోరాడిన అతనికి సహకరించే ఆటగాళ్లు కరువయ్యారు. షేర్ఫేన రూథర్ ఫర్డ్ డకౌట్, షారూఖ్ ఖాన్ (19), రాహుల్ తెవాటియా (14) విఫలం కావడంతో గుజరాత్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. చివర్లో అర్షద్ ఖాన్ (20) మూడు సిక్సర్లతో చెలరేగడంతో ఓటమి అంతరం తగ్గింది. బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో గుజరాత్ ఇప్పుడు ఎలిమినేటర్ ఆడే ప్రమాదంలో పడింది. ముంబై-పంజాబ్, ఆర్సీబీ మ్యాచ్ ల ఫలితాలపై టెన్షన్ గా ఉంది.