MS Dhoni Retirement News: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నేడు ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ ఆడుతున్నాడని, కెప్టెన్ కూల్ రిటైర్మెంట్ వార్త మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. నేడు ఆదివారం, మే 25న గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ సమయంలో ధోని చెప్పిన మాటలు అభిమానులకు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్రతి సంవత్సరం మైదానంలోకి తిరిగి దిగడం ఒక సవాలుగా మారిందన్నాడు ధోనీ. అతడి సారథ్యంలో చెన్నై జట్టు 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించింది.

ధోని తన ఫిట్‌నెస్ గురించి ఏం చెప్పాడంటే.. 

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య IPL 2025లో 66వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ కోసం GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, CSK కెప్టెన్ ధోని కూడా వచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ధోని టాస్ సమయంలో పిచ్, వాతావరణం గురించి మాట్లాడిన తర్వాత తన జట్టు గురించి వివరించాడు. సీజన్ తో ముగిసినట్లేనా అని అడిగిన ప్రశ్నకు ధోనీ బదులిస్తూ.. తన శరీరం ఇంకా సహకరిస్తోందని, కానీ ప్రతి సంవత్సరం తిరిగి రావడానికి ఒక కొత్త సవాలు ఎదురవుతుంది. బాడీ మెయింటెనెన్స్ చాలా అవసరం. కెరీర్ చివరి దశలో ఉన్నానని నాకు తెలుసు. ఈ సమయంలో ఏ ఆటగాడికైనా ఇలాగే ఉంటుంది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను, 18 ఏళ్లు ఐపీఎల్ ఆడాను. అయతే శరీరం సహకరించేందుకు తన ఫిట్ నెస్ గురించి చూసుకున్న వారికి ధన్యవాదాలు తెలిపాడు.

కెప్టెన్‌గా ధోని చివరి మ్యాచ్‌ ఇదేనా..

ఈ సీజన్‌లో మొదట రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. రుతురాజ్ గాయంతో ఐపీఎల్ సీజన్ మధ్యలోనే వైదొలగడంతో ధోనీ చేతికి సీఎస్కే పగ్గాలు వచ్చాయి. వచ్చే సీజన్‌లో రుతురాజ్ మళ్ళీ CSK కెప్టెన్‌గా కనిపించవచ్చు. ధోనీ వచ్చే సీజన్ ఆడినా కెప్టెన్ గా మాత్రం అతడు ఉండడు. రుతురాజ్ లేక మరో ప్లేయర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అందుకే సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడని భావించవచ్చు.

2026లో ధోని తిరిగి వస్తాడా?

ఎంఎస్ ధోని వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడతాడా లేదా అనే దాని గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. తన శరీరం సహకరిస్తే వచ్చే సీజన్లో మళ్లీ మైదానంలో కనిపిస్తా అని ఇటీవల చెప్పాడు. మరో సీజన్ అంటే 8 నెలలు టైం ఉంటుందని, అప్పటికీ శరీరం సహకరిస్తే సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు తన పరిస్థితి తెలియజేస్తానని ధోనీ స్పష్టం చేయడం తెలిసిందే.