IPL 2025 Delhi Capitals: అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 18వ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించినా, లీగ్ సెకండాఫ్ లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరలేకపోయింది. తొలి 4 మ్యాచ్‌లు వరుసగా గెలవడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే మొదటి జట్టు ఢిల్లీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్్ అయింది. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మిచెల్ స్టార్క్ స్వదేశానికి వెళ్ళడం ఢిల్లీకి బిగ్ షాక్. ఢిల్లీ తన చివరి మ్యాచ్‌ను శనివారం పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ అప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ భారత ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్‌ను ఏకంగా 10  కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడానికి కారణం నటరాజన్ వారికి డెత్ ఓవర్లతో కీలకంగా మారి, ప్రత్యర్థుల భరతం పడతామని భావించారు. ఒక బౌలర్ టీ20లో మ్యాక్సిమం 4 ఓవర్లు వేయగలడు, కానీ ఢిల్లీ ఇంత పెద్ద పెద్ద మొత్తం వెచ్చించి తీసుకున్న బౌలర్ మొత్తం సీజన్‌లో 4 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు. 

IPL 2025లో టీ నటరాజన్ వేసిన బంతులు

ఢిల్లీ క్యాపిటల్స్ టీ20 ఫార్మాట్‌కు సరిపోయే డెత్ ఓవర్ స్పెషలిస్టు నటరాజన్‌తో పాటు మిచెల్ స్టార్క్‌ను కూడా కొనుగోలు చేసింది. ఇద్దరు జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు, జట్టు బౌలింగ్ భారాన్ని మోస్తారని అభిమానులు భావించారు. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కానీ ఐపీఎల్ తాత్కాలిక వాయిదాతో అతను స్వదేశానికి వెళ్లి, తిరిగి రాలేదు. నటరాజన్ విషయానికొస్తే, మొత్తం సీజన్‌లో నట్టూ కేవలం 3 ఓవర్లు మాత్రమే వేశాడు. అతను కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, ఒకే ఒక మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ వేశాడు.

మే 18న జరిగిన గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌లో 3 ఓవర్ల స్పెల్ వేశాడు. 16 కంటే ఎక్కువ ఎకానమీతో ఏకంగా 49 పరుగులు ఇచ్చాడు. కాస్ట్‌లీ బౌలర్ అనుకుంటే.. జట్టు భారీ మూల్యం చెల్లించుకునేలా బౌలింగ్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. జీటీ ఓపెనర్లు సాయి సుదర్శన్ 108 పరుగులు, శుభ్‌మన్ గిల్ 93 పరుగులు చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచి, మరో 6 మ్యాచ్‌లు ఓడిపోయింది, ఒక మ్యాచ్ ఫలితం రాలేదు.  15 పాయింట్లతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ముగించింది. శనివారం జరిగిన లీగ్ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ సమీర్ రిజ్వి మ్యాచ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. 207 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో  ఛేదించింది. సీజన్‌ను విజయంతో ముగించింది.

IPL 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్లు

గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. తొలి రెండు స్థానాల కోసం నెంబర్ గేమ్ కొనసాగుతోంది. ఎందుకంటే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఓడినా, క్వాలిఫయర్ 2లో నెగ్గి ఐపీఎల్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది.