IPL 2025 DC Shocks PBKS In Must Win Game: సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శుక్రవారం ఆర్సీబీకి ఎదురైనట్లుగానే, శనివారం పంజాబ్ కింగ్స్ కు చుక్కెదురైంది. జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధంచింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి క్వాలిఫయర్ -1లోకి అడుగు పెట్టాలని భావించిన పంజాబ్ కు నిరాశ కలిగింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (34 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో సత్తా చాటాడు. బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సమీర్ రిజ్వీ సూపర్ ఫిఫ్టీ (25 బంతుల్లో 58 నాటౌట్, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) తో సత్తా చాటాడు. హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు దక్కాయి.
ఓపెనర్ల వైఫల్యం..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (6), ప్రభు సిమ్రాన్ సింగ్ (28) శుభారంభం అందించలేక పోయారు. రెండో ఓవర్లోనే ప్రియాంశ్ వికెట్ ను పంజాబ్ కోల్పోయింది. ఆ తర్వాత జోస్ ఇంగ్లీస్ (32) తో కలిసి ప్రభ్ సిమ్రాన్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ చాలా దూకుడుగా ఆడారు. దీంతో రెండో వికెట్ కు 47 పరుగులను కేవలం 21 బంతుల్లోనే జోడించారు. ఈ దశలో త్వరగానే వీరిద్దరూ ఔటైనా, శ్రేయస్ మాత్రం తన బ్యాటింగ్ తో అలరించాడు. రన్ రేట్ ఏమాత్రం పడకుండా బ్యాటింగ్ చేశాడు. నేహాల్ వధేరా(16), శశాంక్ సింగ్ (11) విఫలమైనా, మార్కస్ స్టొయినిస్ (16 బంతుల్లో 44, 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసకరంగా ఆడాడు. మరో ఎండ్ లో శ్రేయస్ 33 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని ఔటయ్యాడు. చివర్లో స్టొయినిస్ బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. మిగతా బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
సమష్టి బ్యాటింగ్..భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి బ్యాటర్లంతా తలో చేయి వేశారు. ఆరంభంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (35), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (23) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఓవర్ కు పదికి పైగా పరుగులను ఢిల్లీ సాధించింది. దీంతో పవర్ ప్లేలో 61 పరుగులు సాధించింది. అయితే వరుస ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరగడంతో ఢిల్లీ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ దశలో కరుణ్ నాయర్ (44) బాధ్యాతయుతంగా ఆడాడు. వేగంగా ఆడటంతో రన్ రేట్ పడిపోకుండా చూశాడు. సేదికుల్లా అటల్ (22) విఫలమైనా, సమీర్ రిజ్వీ మాత్రం ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆతిథ్య బౌలర్లపై సత్తా చాటిన రిజ్వీ.. 22 బంతుల్లో ఫిప్టీ చేసి ఛేజింగ్ లో తన తడాఖా చూపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ ఈజీగా టార్గెట్ ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి, క్వాలిఫయర్ 1 వైపు వేగంగా చేరుకోవాలన్న పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఇక చివరి మ్యాచ్ లో ముంబైతో ఆ జట్టు ఆమీతుమీ తేల్చుకోనుంది.