IPL 2025 SRH 5TH Win In This Season: సన్ రైజర్స్ హైదరాబాద్.. కీలకద దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దెబ్బకొట్టింది. క్వాలిఫయర్ 1కి అర్హత సాధించేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీకి చుక్కలు చూపించింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో 42 పరుగులతో ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో ఐదో విజయాన్ని సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ మెరుపు అర్థ సెంచరీ (48 బంతుల్లో 94 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు)తో త్రుటిలో సెంచరీని మిస్సయ్యాడు. బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్ లో19.5 ఓవర్లలో ఆర్సీబీ.. 189 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ సూపర్ ఫిఫ్టీ (32 బంతుల్లో 62, 4 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
వన్ మేన్ షో..తొలి మ్యాచ్ లో సెంచరీ తర్వాత ఆ తరహా ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమైన ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్ లో జూలు విదిల్చాడు. భారీ అర్ధ సెంచరీతో వన్ మేన్ షో చూపించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మరోసారి అదిరే ఆరంభం దక్కింది. గత మ్యాచ్ కు దూరమైన ట్రావిస్ హెడ్ (17) ఈ మ్యాచ్ లో ఆడినా, సత్తా చాటలేక పోయాడు. మరో ఎండ్ లో మాత్రం అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. తన జోరుతో నాలుగు ఓవర్లలోనే 54 పరుగులను సన్ సాధించింది. అయితే ఓపెనర్లిద్దరూ ఒకేసారి ఔటయ్యాక.. హెన్రిచ్ క్లాసెన్ (24) తో కలిసి ఇషాన్ కిషన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 48 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదుట పడింది. క్లాసెన్ ఔటైన తర్వాత ఇషాన్ మరింత జోరుతో బ్యాటింగ్ చేశాడు. అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) వేగంగా ఆడాడు. అయితే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఇషాన్.. 28 బంతుల్లో ఫిఫ్టీ చేసి, చివరి కంటా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. నితీశ్ (4) విఫలమైనా, అభినవ్ మనోహర్ (12) పాట్ కమిన్స్ (13 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
సూపర్ భాగస్వామ్యం..భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ (43), సాల్ట్ సూపర్ పార్ట్నర్ షిప్ నెలకొల్పారు. ఆరంభం నుంచే దూకుడుగా వీరిద్దరూ ఆడటంతో ఓవర్ కు 12 పరుగులకు పరుగులు సాధించారు. ముఖ్యంగా కోహ్లీ, సాల్ట్ ఒకరికి మించి మరొకరు బౌలర్లను చితకబాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 72 పరుగులు సాధించింది. ఆ తర్వాత కోహ్లీ ఔటవడంతో తొలి వికెట్ కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఒక ఎండ్ లో సాల్ట్ దూకుడుగా ఆడగా, మరో ఎండ్ లో ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. 27 బంతుల్లో ఫిఫ్టీ చేసిన సాల్ట్ కూడా వెనుదిరగడంతో ఆర్సీబీకి పరాజయం ఖాయమైంది. హిట్టర్లు కెప్టెన్ రజత్ పతిదార్ (18), జితేశ్ శర్మ (24), షెఫర్డ్ డకౌట్, టిమ్ డేవిడ్ (1),క్రునాల్ పాండ్యా (8) విఫలం కావడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. మిగతా బౌలర్లలో ఇషాన్ మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ ఫలితంతో టాప్ ప్లేస్ కు చేరాలనే ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. మరో మ్యాచ్ లో విజయం సాధిస్తేనే టాప్-2లో నిలబడి, క్వాలిఫయర్ 1కి అర్హత సాధిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలవ్వడంతో రన్ రేట్ పడిపోయి, ఆర్సీబీకి మూడో స్థానానికి దిగజారింది.