Rohit Sharma Vs Virat Kohli: వచ్చేనెలలో ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటనను భారత్ జరుపనుంది. జూన్ మూడోవారం నుంచి మొదలయ్యే ఈ పర్యటన దాదాపు 45 రోజులపాటు కొనసాగుతుంది. ఈ పర్యటనలో 5 టెస్టులను భారత్ ఆడనుంది. వచ్చే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసును ఈ టూర్ నుంచే భారత్ మొదలు పెట్టనుంది. అయితే ఈ టూర్ కు భారత సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దిగ్గజ ద్వయం లేకుండానే ఈ పర్యటనను భారత్ ఆడనుంది. అలాగే ఈ సీరస్ నుంచి కొత్త కెప్టెన్ నాయకత్వంలో భారత్ ఆడనుంది. తాజాగా కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై హెడ్ కోచ్ గౌతం గంభీర్ మనసులోని మాట విప్పాడు. వారిద్దరూ దూరమైన తర్వాత తను మాట్లాడటం ఇదే తొలిసారి.
అద్భుత అవకాశం..సీనియర్లు దూరమైన వేళ, తమకు లభించిన అవకాశాలను ఒడిసి పట్టడానికి యువ ప్లేయర్లకు ఇదే చక్కని అవకాశమని గంభీర్ పేర్కొన్నాడు. ఎన్నాళ్లుగానో టీమిండియాకు ఆడాలనే కలను యువ ఆటగాళ్లు కంటున్నారని, ప్రస్తుతం తమను తాము నిరూపించుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. ఈ సీరీస్ రాణిస్తే టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని అభిప్రాయ పడ్డాడు. అందుచేత తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ లాగే..ఇక గత మార్చిలో ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కీలక పేసర్ జస్ ప్రీత్ బుమ్రా గాయంతో అందు బాటులో లేడని, ఆ సమయంలో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పినట్లు గంభీర్ గుర్తు చేశాడు. ఆ సమయంలో కూడా ప్రధాన పేసర్ లేకుండానే తాము టోర్నీని గెలుచుకున్నామని, ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ టోర్నీకి ముందు కాస్త ఒత్తిడితో ఉన్న భారత్.. అద్భుతమైన విజయాలతో టోర్నీని కైవసం చేసుకుంది. ముఖ్యంగా 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ ను దక్కించుకుంది. అలాగే తన కెప్టెన్సీలో వరుసగా రెండో ఐసీసీ టైటిల్ ను భారత్ సాధించింది. ఇక రోకో ద్వయం రిటైర్మెంట్ పై స్పందిస్తూ.. వీడ్కోలు పలకడం అనేది ఇండివిడ్యువల్ నిర్ణయమని, దానిపై ఎవరి ప్రభావం లేదని చెప్పుకొచ్చాడు. ఆటను ఎప్పుడు ఆపాలో ఆటగాళ్ల కంటే కూడా ఎక్కువగా ఎవరికీ తెలియదని, వాళ్లే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాడు. ఇక ఈనెలలో టెస్టు ఫార్మాట్ తొలుత రోహిత్, ఆ తర్వాత కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోకో ద్వయం పొట్టి ఫార్మాట్ కు టాటా చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడు తున్నారు.