IPL 2025 MI VS DC Updates: ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గ‌నే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 59 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించి, తన దైన శైలిలో నాకౌట్ బెర్త్ ద‌క్కించుకుంది. ఈ మ్యాచ్ లో 73 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క‌పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆరంభంలో ఓపిక‌గా ఆడిన సూర్య‌, స్లాగ్ ఓవ‌ర్ల‌లో స‌త్తా చాటి, అద్భుత‌మైన అర్థ సెంచ‌రీ సాధించాడు. ఈ క్ర‌మంలో పొట్టి ఫార్మాట్లో ప్ర‌పంచ రికార్డును స‌మం చేశాడు. వ‌రుస‌గా 13 సార్లు 25+ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్ టెంబా బవూమా రికార్డును త‌ను స‌మం చేశాడు. ఈ రికార్డు ద్వారా సూర్య ఫామ్ ఎంత భ‌యంక‌రంగా ఉందో తెలుస్తోంది. బ్యాటింగ్ కు క‌ష్ట‌సాధ్య‌మైన పిచ్ పై తన దైన మార్కు షాట్ల‌తో అల‌రించి, ముంబైకి భారీ స్కోరును అందించాడు. 

భార్య కోరిక మేర‌కు..ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్య‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అయితే మ్యాచ్ అయిన త‌ర్వాత సూర్య ఇక ఇంట‌రెస్టింగ్ విష‌యాన్ని పంచుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు సీజ‌న్ లో 13 మ్యాచ్ లు ఆడాన‌ని, అందులో చాలావ‌ర‌కు అవార్డులు సాధించినా, ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించ‌లేన‌ని  త‌న భార్య కంప్ల‌యింట్ చేసింద‌ని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో త‌న ప్ర‌ద‌ర్శ‌న ద్వారా ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ విజ‌యం జ‌ట్టు కెంతో ముఖ్య‌మ‌ని, కీల‌క స‌మ‌యంలో స‌త్తా చాటి, జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. 

చివ‌రి దాకా ఉండాల‌ని..ఇక పిచ్ ను ప‌రిశీలించి, అందుకు త‌గిన‌ట్లుగా ఆడిన‌ట్లు సూర్య పేర్కొన్నాడు. ఒక్క ఓవ‌ర్ లో 15-20 ప‌రుగులు సాధిస్తే మూమెంటం వ‌స్తుంద‌ని భావించిన‌ట్లు వెల్ల‌డించాడు. న‌మ‌న్ ధీర్ వ‌చ్చిన త‌ర్వాత త‌ను వేగంగా ఆడి, ఆ మూమెంటం ను తీసుకొచ్చాడ‌ని, ఆ ఊపులో జ‌ట్టుకు భారీ స్కోరు అందించ‌గ‌లిగే ర‌న్స్ సాధించిన‌ట్లు తెలిపాడు. ఇక పిచ్ రిత్యా చివ‌రి వ‌ర‌కు తాను ఉండాలని భావించాన‌ని, అప్పుడే జ‌ట్టు భారీ స్కోరు చేయ‌గ‌ల‌ద‌ని ఆశించిన‌ట్లు పేర్కొన్నాడు. ఇక ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 180 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్ యాద‌వ్ అజేయ ఫిఫ్టీ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.ఇక ఛేజింగ్ లో ఢిల్లీ 18.2 ఓవ‌ర్ల‌లో 121 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ స‌మీర్ రిజ్వీ (39) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మిషెల్ శాంట్న‌ర్ (3/11) పొదుపుగా బౌలింగ్ చేయ‌డంతోపాటు మూడు కీల‌క వికెట్లు తీశాడు.