IPL 2025 MI VS DC Live Updates: మరో మ్యాచ్ మిగిలి ఉండగనే ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులతో నెగ్గిన ముంబై.. తమ కెరీర్లో 11వ సారి నాకౌట్ కు అర్హత సాధించింది. తాజా ఫలితంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్ యాదవ్ అజేయ ఫిఫ్టీ (43 బంతుల్లో 73 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీసి టాప్ గా నిలిచినా, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఛేజింగ్ లో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్ సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిషెల్ శాంట్నర్ (3/11) పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు మూడు కీలక వికెట్లు తీశాడు.
చివర్లో ఫినిషింగ్..బ్యాటింగ్ కు కష్టసాధ్యమైన ఈ పిచ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై కాస్త కష్టపడింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (5) వికెట్ కు త్వరగానే కోల్పోయిన ముంబైని.. ర్యాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 25 పరుగులు జోడించి, ఇన్నింగ్స్ నిర్మించారు. ఆ తర్వాత కొద్ది తేడాతో వీరిద్దరూ వెనుదిరిగినా, సూర్య మాత్రం తన మాస్ బ్యాటింగ్ చూపించాడు. ఆరంభంలో ఆచి తూచి ఆడిన సూర్య.. ఇన్నింగ్స్ స్లాగ్ ఓవర్లలో రెచ్చిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు చివర్లో నమన్ ధీర్ (24 నాటౌట్) వేగంగా ఆడాడు. అంతకుముందు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (27) ఫర్వాలేదనిపించాడు. చివరి 21 బంతుల్లో 57 పరుగులను సూర్య, నమన్ సాధించడం విశేషం.
బ్యాటింగ్ వైఫల్యం.. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరం కావడంతో ఢిల్లీ బలహీన పడింది. ఈక్రమంలో డుప్లెసిస్ నాయకత్వ బాధ్యతలు వహించాడు. అయితే కీలకమైన మ్యాచ్ లో భారీ టార్గెట్ ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కేఎల్ రాహుల్ (11), డుప్లెసిస్ (6), అభిషేక్ పొరెల్ (6) లను కోల్పోయి, ఛేజింగ్ లో వెనకబడింది. ఈ క్రమంలో రిజ్వీతోపాటు విప్రజ్ నిగమ్ (20) కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రిజ్వీతోపాటు ట్రిస్టన్ స్టబ్స్ (2), అశుతోష్ శర్మ (18) త్వరగా ఔట్ కావడంతో ఢిల్లీ మ్యాచ్ నుంచి ఔటయిపోయింది. ఈ విజయంతో గుజారాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ లతోపాటు ముంబై కూడా టాప్-లో స్థానం సంపాదించి, ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.