Abhishek Sharma Becomes First Indian To Hit 40 Sixes In An Ipl Season: ఐపీఎల్(IPL) 2024 సీజన్‍లో అద్భుతమైన ఫామ్‍లో ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్(SRH) బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఓ రికార్డు సృష్టించాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా మే 19న పంజాబ్ కింగ్స్(PBKS)తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. ఇప్పటికే టన సునామీ బ్యాటింగ్‌తో ప్రపంచ టాప్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న అభిషేక్ ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో 40కిపైగ సిక్సులు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదేశాడు. 66 పరుగులతో అద్భుతమైన అర్ధ శతకం చేశాడు. 2016 సీజన్‍లో విరాట్ కోహ్లీ 38 సిక్స్‌లు కొట్టాడు. అయితే, ఇప్పుడు దాన్ని దాటేసి ఓ ఐపీఎల్ ఎడిషన్‍లో అత్యధిక సిక్స్‌లు సాధించిన భారత ఆటగాడిగా రికార్డును అభిషేక్ సాధించాడు. అయితే.. ఈ సీజన్ ఇంకా మిగిలుంది. ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ రెండు జట్లు ప్లేఆఫ్స్ ఆడబోతున్నాయి. కాబట్టి.. ఈ మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ, అభిషేక్ సిక్స్‌ల మోత మోగించే అవకాశం ఉంది. అభిమానులకి కన్నుల పండుగ చేసే అవకాశం ఉంది.
అభిషేక్ ఏమన్నాడంటే..
ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో తన ఆటతీరుపై శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఎడిషన్‌లో బ్యాటర్లదే హవా. ప్రస్తుతం నేను నా బ్యాటింగ్ ప్రదర్శనను జట్టు విజయాల కోసం ఉపయోగిస్తున్నా. పంజాబ్‌తో భారీ లక్ష్యం ఉండటంతో నా వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశా. ఎలాంటి షాట్లు కొట్టాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా. లారా కోచ్‌గా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇప్పటికీ ఏదైనా సందేహం ఉంటే లారా అందుబాటులోనే ఉంటాడు. చెత్త బంతుల కోసం వెయిట్ చేసి మరీ ఆడుతున్నా. బౌలర్లను కాస్త ఒత్తిడికి గురి చేస్తే ఆ తర్వాత మనం అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయొచ్చు". ఈ సందర్భంగా ఉప్పల్ మైదానం క్యురేటర్, గ్రౌండ్ సిబ్బందిని అభిషేక్ ప్రత్యేకంగా అభినందించాడు. తమకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానిక వస్తే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్(PBKS) కెప్టెన్ జితేశ్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన తరువాత బ్యాటర్ లు బాగా కుదురుకోవడంతో హైదరాబాద్ బౌలర్లు వికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మాత్రం విడగొట్టలేకపోయారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తొమ్మిది ఓవర్లకు పంజాబ్ స్కోరు 97 పరుగులు చేరిన తర్వాత కానీ హైదరాబాద్‌కు తొలి వికెట్ దక్కలేదు. మొత్తానికి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ తొలి బంతికే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతికే మంచి ఫామ్‌లో ఉన్న ట్రానిస్ హెడ్ అవుటయ్యాడు. కానీ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 28 బంతుల్లో అయిదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 66 పరుగులు చేసి హైదరాబాద్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. రికార్డులను సొంతం చేసుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, నితీశ్‌కుమార్ రెడ్డి రాణించారు. గత కొన్ని మ్యాచులుగా వరుసగా విఫలమవుతున్న క్లాసెన్ ఈ మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మొత్తానికి విజయాన్ని అందించారు.