Harshit Rana  And Sunil Narine : సీజన్‌లో సునీల్ నరైన్ ఓ సర్ ప్రైజింగ్ ప్యాకేజ్. కోల్‌కతా నైటర్ రైడర్స్ ఐదారేళ్ల గౌతం గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసిన ప్రయోగాన్నే మళ్లీ చేయించింది. అదే నరైన్‌ను ఓపెనర్‌గా పంపటం. నెక్ట్స్ బ్యాటర్ల గురించి ఆందోళన ఉండకూడదు. పించ్ హిట్టింగ్ చేయటమే. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టటమే. ఆ భరోసానే ఈసారి నరైన్‌ను ఎక్ల్‌ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడేలా చేసింది. 


ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచులు ఆడిన నరైన్ 461 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నిన్న లక్నో మీద విరుచుకుపడ్డాడు. 39 బాల్స్‌లో ఆరు ఫోర్లు 7 సిక్సులతో 81 పరుగులు చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఆయుష్ బడోని వికెట్ తీశాడు. ఇలా కోల్‌కతా విజయాల్లో నరైన్‌దే కీలకపాత్ర. 


అత్యధిక పరుగు వీరుల జాబితాలో విరాట్ కొహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు నరైన్. సీజన్‌లో అందరికంటే అత్యధికంగా 32సిక్సులు కొట్టాడు. క్లాసెన్ కూడా నరైన్ తర్వాతే ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో 14వికెట్లతో ఆరోస్థానంలో ఉన్నాడు. ఎకానమీ జస్ట్ 6.6.ఇలా అటు బ్యాటర్‌గా ఇటు బౌలర్‌గా అదిరిపోయే ఫర్‌ఫార్మెన్స్ చూపిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుతానికి టేబుల్ టాపర్‌గా నిలిచేలా చేశాడు సునీల్ నరైన్. 
నరైన్ కెరీర్ మొత్తంలో ఈ స్థాయిలో ఓ సీజన్‌లో పరుగులు చేసింది లేదు. వికెట్ల విషయంలో దూసుకువెళ్లింది లేదు. కోల్‌కతా ప్రయోగాలు సఫలమై నరైన్ అత్యద్భుతంగా వాడుకున్న టీమ్‌గా అద్భుతమైన ఫలితాలను అందుకుంటోంది.


హర్షిత్ రానా సైలెన్స్‌


హర్షిత్ రానా..కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఈ ఐపీఎల్ సీజన్‌లో బాగా రాణిస్తున్న యంగ్ బౌలర్. మూడు సీజన్లుగా కోల్‌కతాకు ఆడుతున్న ఈ 22ఏళ్ల కుర్రాడు ఈ ఏడాదే లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఇప్పటివరకూ 9 మ్యాచుల్లో 14వికెట్లు తీయటం ద్వారా అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో 8వస్థానంలో ఉన్నాడు. అయితే వికెట్లు తీసుకునే నైపుణ్యంలో కాకుండా వికెట్ తర్వాత చేసే సెలబ్రేషన్స్ విషయంలో హర్షిత్ రానా వార్తల్లో నిలవటం ఇక్కడ మేటర్. 


సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మొట్ట మొదటి మ్యాచ్‌లోనే మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేసి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం దానికి మయాంక్ సీరియస్‌గా చూడటం వైరల్‌గా మారింది. తర్వాత రోహిత్ శర్మ కూడా మయాంక్‌ను ఏడిపించటానికి హర్షిత్ రానానే ఇమిటేట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో తన ప్రవర్తనకు మ్యాచులో ఫీజులో కోతను ఎదుర్కొన్న హర్షిత్ రానా ఆ తర్వాత మ్యాచుల్లో కూడా అలానే బిహేవ్ చేశాడు.


వికెట్ తీయగానే పట్టరాని ఆనందంతో బ్యాటర్ల దగ్గరకు వెళ్లి మితిమీరి ప్రవర్తిస్తుండటంతో రిఫరీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్షిత్ రానాపై పూర్తి మ్యాచ్ ఫీజు కోత వేయటంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధించారు. అలా ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్ ఆడలేకపోయిన హర్షిత్ రానా.. లక్నో మీద మ్యాచ్‌లో తిరిగి వచ్చాడు. ఈసారి కూడా మంచిగా బౌలింగ్ చేసి ఏకంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు ఈ యంగ్ బౌలర్. అయితే నో సెలబ్రేషన్ నోటి మీద వేలేసుకునే కనిపించాడు. తర్వాత కృనాల్ పాండ్యా, రవిబిష్ణోయ్ వికెట్లు తీసుకున్నా కూడా అంతే. నోటి మీద వేలు పెట్టుకునే కనిపించాడు కానీ ఎలాంటి సంబరాలు అండ్ అతి చేయలేదు. దీన్ని రస్సెల్ అండ్ రమణ్ దీప్ సింగ్ ఇమిటేట్ చేస్తూ హర్షిత్ రానాను ఆటపట్టించారు కూడా. అలా వికెట్లు తీసి గంతులేస్తూ గాల్లోకి ముద్దులు విసురుతూ కనిపించే హర్షిత్ రానా నాకేం తెలియదు నేనేం చేయలేదు చూడండి నామీద మ్యాచ్ నిషేధాలు వద్దు అన్నట్లు తన క్రమశిక్షణను, నిరసనను ఇలా తెలియచేశాడన్నమాట హర్షిత్ రానా.