MI vs SRH IPL 2024 : అసలే బ్యాటర్లకు స్వర్గధామంలాంటి ముంబైలోని వాంఖడే(Wankhede) పిచ్‌.... అందులోనూ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న హైదరాబాద్‌(SRH) బ్యాటర్లు... ఇప్పటికే ఓసారి ముంబై బౌలర్లను ఊచకోత కోశారు... ఇప్పుడు మళ్లీ అదే జట్టుతో ఆడబోతున్నారు. ఓవైపు హైదరాబాద్‌ ఆత్మ విశ్వాసంతో ఉంటే మరోవైపు ముంబై వరుస ఓటములతో కుదేలైంది. ఇంకేం ముంబై-హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టార్గెట్‌ 300 పరుగులు సాధ్యమేనని మాజీలు అంచనా వేస్తున్నారు. మరోసారి హెడ్‌, అభిషేక్‌ శర్మ చెలరేగితే ముంబై బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇదే సీజన్‌లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన హైదరాబాద్‌ బ్యాటర్లు... ఈసారి 300 మార్క్‌ అందుకుని చరిత్ర సృష్టించడంతోపాటు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 


వాంఖడే పిచ్‌పై బ్యాటర్లకు పండగే
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170. వాంఖడే పిచ్ పరిస్థితుల ప్రకారం టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. వాంఖడేలో ఫ్లడ్‌లైట్ల కింద కొత్త బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఛేజింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. పవర్ ప్లే‌లో దూకుడుగా ఆడితే భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయం. 


హైదరాబాద్‌ మామూలుగా లేదు...
ఈ ఐపీఎల్‌(IPL 2024) సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)  ప్రత్యర్థి జట్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తొలి బంతి నుంచి విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఢిల్లీపైన విధ్వంసకర బ్యాటింగ్‌తో 250కుపైగా పరుగులు సాధించింది. పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనే 300 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అందుకుంటుందని అందరూ భావించారు. కానీ హైదరాబాద్‌ మిడిల్‌ ఆర్డర్‌ కాస్త తడబడడంతో ఈ ఛేదన సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం ముంబైతో జరిగే మ్యాచ్‌లో 300 పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. 


ఆ మ్యాచ్‌ గుర్తుందిగా... 
ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్‌ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్‌ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. ఓ వైపు ట్రానిస్‌ హెడ్‌ విధ్వంసం... మరోవైపు అభిషేక్‌ శర్మ మెరుపు దాడి, క్లాసెన్‌, మార్క్రమ్‌ ఊచకోత, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌రెడ్డి తుపాను ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్‌ జట్టుకు 300 పరుగుల మార్క్‌ సాధ్యమే అనిపిస్తోంది. పటిష్టమైన ముంబై బౌలర్లను ఎదుర్కొని 277 పరుగులు చేసిన హైదరాబాద్‌... బెంగళూరు బౌలింగ్‌నూ ఊచకోత కోసి 287 పరుగులు చేసింది. ఢిల్లీపైనా 250కుపైగా పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగలు చేసిన హైదరాబాద్‌.. మరోసారి 300 పరుగుల లక్ష్యంపై కన్నేసింది.