SRH vs RCB IPL 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024(IPL) సీజన్ 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనుంది. గత మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ మరోసారి పిడుగులా విరుచుకు పడాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనుండడంతో బెంగళూరు కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బెంగళూరు మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు.
రికార్డులు బద్దలు కావాల్సిందేనా...
బ్యాటర్ల స్వర్గధామంగా మారిన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో SRH జట్టుతో RCB జట్టు తలపడనుంది. ఇది మరో రికార్డుల పోరుగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సీజన్‌లో జరిగిన గత మ్యాచ్‌లో బెంగళూరుపై 287 పరుగులు చేసి హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 262 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు రెండు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం 549 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 22 సిక్సర్లు కొట్టారు . ఆ మ్యాచ్‌లో మొత్తం 81 బౌండరీలు నమోదయ్యాయి. అందువల్ల ఈ మ్యాచ్‌లోనూ సిక్స్-ఫోర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో హైదరాదాబ్ గెలిచినా బెంగళూరు గొప్ప పోటీని ఇచ్చింది. అందువల్ల ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల నుంచి ఉత్కంఠ పోరును ఆశించవచ్చు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లోనే మూడుసార్లు 250 పరుగుల మార్కును అధిగమించిన సన్‌రైజర్స్... మరోసారి బౌండరీల మోత మోగించాలని చూస్తోంది. ట్రావిస్ హెడ్ నేతృత్వంలోని హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్... ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ పవర్‌ప్లేలో 125/0 స్కోర్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో మొదటిసారిగా 300 పరుగుల మార్కును అందుకోవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. బలహీనమైన బెంగళూరు బౌలింగ్‌లో ఇది సాధమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఈ సీజన్‌లో ఆర్సీబీ అత్యుత్తమ బౌలర్ అయిన యష్ దయాల్..ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్20లో కూడా స్థానం సంపాదించలేదంటే బెంగళూరు బౌలింగ్ కష్టాలు అర్థం చేసుకోవచ్చు .
అన్నీ కష్టాలే
ఆర్సీబీ అన్ని విభాగాల్లో విఫలమవుతూ కష్టాలు ఎదుర్కొంటోంది. RCB వారి గత ఐదు మ్యాచ్‌లలో కనీసం 180 పరుగులు చేసింది. అయితే సమష్టిగా రాణించలేకపోవడంతో వారికి విజయం అందని ద్రాక్షగా మారిపోయింది. బౌలర్లు విఫలమవుతున్నా బ్యాటర్లు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. 222 పరుగులు చేసినా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడం వారిని మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.