Delhi Capitals won by 3 runs: గుజరాత్(GT)తో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) విజయం సాధించింది. గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి అయిదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి అయిదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్ ఖాన్ పోరాడినా గుజరాత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ 220 పరుగులకే పరిమితమైంది.
మెరిసిన పంత్, అక్షర్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. పృథ్వీ షా-మెక్ గుర్క్ తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. పృథ్వీ షా ఏడు బంతుల్లో 2 ఫోర్లతో పదకొండు పరుగులు చేసి అవుటవ్వగా... మెక్‌గుర్క్ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు మందగించింది. 35 పరుగుల వద్ద పృథ్వీ షా అవుటవ్వగా... 36 పరుగుల వద్ద మెక్ గుర్క్ కూడా అవుటయ్యాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటైన తర్వాత అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షాయ్ హోప్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా అక్షర్ మాత్రం పట్టు వదల్లేదు. గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అక్షర్...43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. రిషబ్ పంత్‌తో కలిసి అక్షర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్షర్ వెనుదిరిగిన తర్వాత పంత్ జోరు అందుకున్నాడు. స్టబ్స్‌తో కలిసి మరో వికెట్ పడకుండా ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంత్ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత పాత పంత్‌ను గుర్తు చేశాడు. పంత్ 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో స్టబ్స్ విధ్వంసం సృష్టించాడు. కేవలం ఏడే బంతులు ఎదుర్కొన్న స్టబ్స్...3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
గుజరాత్ పోరాడినా
225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. కానీ వృద్ధిమాన్‌సాహా, సాయి సుదర్శన్ గుజరాత్‌ను విజయం వైపు నడిపించారు. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో భారీ స్కోరును ఛేదించే దిశగా గుజరాత్ పయనించింది. వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటవ్వగా...సాయి సుదర్శన్ 39 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ వీరు వెంటవెంటనే అవుటయ్యారు. తర్వాత ఒమ్రాజాయ్ ఒకటి, షారూఖ్ ఖాన్ ఎనిమిది, తెవాటియా నాలుగు పరుగులకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. కానీ డేవిడ్ మిల్లర్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. చివర్లో రషీద్‌ఖాన్ కూడా 21 పరుగులతో పోరాడాడు. చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి అయిదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి అయిదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్ ఖాన్ పోరాడినా గుజరాత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.