DC Vs GT IPL 2024 Gujarat Titans target 225:  గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, స్టబ్స్‌ రాణించడంతో  ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ మూడు వికెట్లు తీసి ఢిల్లీ మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగాడు. పంత్‌ 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.


అజేయంగా పంత్‌    


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని గుజరాత్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. పృథ్వీ షా-మెక్‌ గుర్క్‌ తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. పృథ్వీ షా ఏడు బంతుల్లో 2 ఫోర్లతో పదకొండు పరుగులు చేసి అవుటవ్వగా... మెక్‌గుర్క్‌ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ వీరిద్దరూ  వెంటవెంటనే అవుట్‌ కావడంతో ఢిల్లీ స్కోరు మందగించింది. 35 పరుగుల వద్ద పృథ్వీ షా అవుటవ్వగా... 36 పరుగుల వద్ద మెక్‌ గుర్క్‌ కూడా అవుటయ్యాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటైన తర్వాత అక్షర్‌ పటేల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. షాయ్‌ హోప్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా అక్షర్‌ మాత్రం పట్టు వదల్లేదు. గుజరాత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అక్షర్...43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. రిషబ్‌ పంత్‌తో కలిసి అక్షర్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్షర్‌ వెనుదిరిగిన తర్వాత పంత్‌ జోరు అందుకున్నాడు. స్టబ్స్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంత్‌ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత పాత పంత్‌ను గుర్తు చేశాడు. పంత్‌ 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో స్టబ్స్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం ఏడే బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌...3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.


గుజరాత్‌ది అదే కథ
ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌ కూడా ఈ సీజన్‌లో అస్థిరంగానే కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన గుజరాత్‌... అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. గుజరాత్‌ ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ పాయింట్ల పట్టికలో పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే గుజరాత్‌కు కూడా ఇది కీలక మ్యాచ్‌. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రాణిస్తుండడం గుజరాత్‌కు సానుకూలంశం. రాహుల్ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాలని గుజరాత్‌ కోరుకుంటోంది.