SRH 94/1 In Power Play: హెడ్ మాస్టర్ విధ్వంసం.. పవర్ ప్లేలో సన్ రైజర్స్ భారీ స్కోరు.. రాయల్స్ బౌలర్లను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
అభిమానులు ఏదైతే ఊహించారో, అదే చూసి చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. రాయల్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ పవర్ ప్లేలో దాదాపు సెంచరీ పరుగులు చేశారు. 94/1తో మరోసారి తన భీభత్సాన్ని రుచి చూపించారు.

IPL 2025 SRH VS RR Live Updates: ఐపీఎల్లో 2025 కాటేరమ్మ కొడుకుల ఊచకోత మొదలైంది. ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. తొలి ఓవర్ నుంచే ఊచకోత మొదలు పెట్టిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు.. రాయల్స్ బౌలర్లు ఉతికారేశారు. దీంతో పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఆరంభంలో అభిషేక్ శర్మ (24) ఈ ఊచకోతను స్టార్ట్ చేశాడు. ఫజల్ హఖ్ ఫారూఖీ వేసిన తొలి ఓవర్లు రెండు ఫోర్లతో 9 పరుగులు వచ్చాయి. ముఖ్యంగా కవర్స్ , మిడాన్ దిశగా రెండు కళ్లు చెదిరే ఫోర్లు కొట్టి పరుగుల వరదకు గేట్లేత్తాడు. తర్వాత ఓవర్లో ట్రావిస్ హెడ్ (31బంతుల్లో 67, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రాక్ లోకి వచ్చాడు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ వేసిన ఓవర్లో పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన హెడ్.. ఆ తర్వాత బంతినే ముందుకొచ్చి బంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. మ్యాచ్ లో ఇదే తొలి సిక్సర్ కావడం విశేషం.
అభిషేక్ వెనుదిరిగినా..
మూడో ఓవర్ నుంచి ఫిఫ్త్ గేర్ లోకి వచ్చిన సన్.. ఆ ఓవర్లలో ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో ఏకంగా సన్ 21 పరుగులు పిండుకుంది. ముఖ్యంగా అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా, హెడ్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా సిక్సర్ ను బాదాడు. మెరుపు వేగంతో సాగుతున్న ఎస్ ఆర్ హెచ్ కు నాలుగో ఓవర్లో చిన్న జెర్క్ తగిలింది. తీక్షణ వేసిన ఆ ఓవర్ తొలి బంతికే అభిషేక్.. భారీ షాట్ కు ప్రయత్నించి, యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్ కు నమోదైన 19 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అభిషేక్ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ మరింత ధాటిగా ఆడటంతో రాయల్స్ పరిస్థితి పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్లు అయిపోయింది. అదే ఓవర్లో రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు.
21 బంతుల్లో ఫిఫ్టీ..
వికెట్ పడినా హెడ్ జోరు తగ్గలేదు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో హెడ్ విధ్వంసమే సృష్టించాడు. నాలుగు పోర్లు, ఒక సిక్సర్ కొట్టి ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. హెడ్ జోరుకు ఏం చేయాలో తోచక ఆర్చర్ .. టార్చర్ అనుభవించాడు. ఎటు వైపు వేసినా, బంతి బౌండరీ వైపు వెళుతుండటంతో ఏం చేయాలో తోచక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు సాధించడంతో సన్ స్కోరు 94 పరుగులకు చేరుకుంది. నిజానికి ఆ ఓవర్ ఆఖరి బంతిని నోబాల్ గా తేలింది. దీంతో తీక్షణ మళ్లీ ఆ బాల్ వేయగా, దాన్ని బౌండరీకి తరలించాడు. అలా ఆడుతూ ఎనిమిదో ఓవర్ తొలిబంతికి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న హెడ్.. 21 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇషాన్, హెడ్ జంట తమ జోరును కొనసాగించింది. రెండో వికెట్ కు 38 బంతుల్లో 85 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత హెడ్ ను తుషార్ దేశ్ పాండే పెవిలియన్ కు పంపించాడు. దీంతో 130 పరుగుల వద్ద రెండో వికెట్ ను సన్ కోల్పోయింది.