IPL 2025 Shreyas Iyer News: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సాధించాడు. మూడు డిఫరెంట్ జట్లకు నాయకత్వం వహించి , ఆ మూడు జట్లను ప్లే ఆఫ్స్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించిన అయ్యర్.. అతని నాయకత్వంలోనే తొలి ఫైనల్ ఆడింది. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహించిన అయ్యర్.. ఆ జట్టును గతేడాది చాంపియన్ గా నిలిపిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత కోల్ కతా చాంపియన్ గా నిలవడం విశేషం. తాజాగా పంజాబ్ కింగ్స్ కు ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న అయ్యర్.. ఆదివారం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి, తన జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఈక్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో గతేడాది కోల్ కతాకు తను టైటిల్ సాధించి పెట్టడం ప్లూక్ గా వచ్చింది కాదని నిరూపించాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించడం కొసమెరుపు.
విమర్శకులకు జవాబు..నిజానికి గతేడాది జట్టును అద్భుతంగా నడిపి, కేకేఆర్ కు శ్రేయస్ టైటిల్ అందించాడు. అయితే అతనికి రావాల్సినంత పేరు రాలేదు. ఎక్కువగ సపోర్ట్ స్టాఫ్ కే ఈ ఘనత వెళ్లింది. ముఖ్యంగా మెంటార్ గౌతం గంభీర్ పేరు మార్మోగి పోయింది. ఈ ప్రదర్శనతో తాను ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గా ప్రమోషన్ కూడా పొందాడు. అప్పట్లో గంభీర్ వ్యూహాలతోనే కేకేఆర్ మూడో టైటిల్ సాధించిందని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఈ ఏడాది అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. తమ తొలి టైటిల్ వేటలో పంజాబ్ కింగ్స్ తలమునకలై ఉంది. ఇక తాజా ఘనతతో దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం విశేషం.
సమష్టితత్వంతోనే.. ఇక రాజస్థాన్ విజయంపై శ్రేయస్ మనసు విప్పి మాట్లాడాడు. జట్టు సమష్టిగా చెలరేగడంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో 15కు పైగా రన్ రేట్ తో విధ్వంసం జరిగాక, తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని కొనియాడాడు. ఈ ఘనత అంతా వారికే చెందుతుందని పేర్కొన్నాడు. ప్రణాళికలను సమర్థంగా ఎదుర్కోవడంలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారని తెలిపాడు. ఇక తన చేతివేలికి గాయం కావడంతోనే తాను రాయల్స్ బ్యాటింగ్ టైంలో మైదానంలోకి రాలేదని, అంతకుముందు ప్రాక్టీస్ చేసే సమయంలో ఈ గాయం అయిందని తెలిపాడు. ఈ గాయంపై స్పష్టత త్వరలోనే వస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా శ్రేయస్ నాయకత్వంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరడం సంతోషంగా ఉందని ఆజట్టు అభిమానులు తెలిపారు. అదే జోరులో కప్పు కూడా సాధించాలని పేర్కొంటున్నారు.