IPL 2025 GT Tops In Points Table: గుజ‌రాత్ జూలు విదిల్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ప‌ది వికెట్ల‌తో గెలుపొంది, ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. గుజ‌రాత్ తో గెలుపుతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ కూడా నాకౌట్ కు అర్హత సాధించాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఈ మ్యాచ్ లో ప‌ది వికెట్ల‌తో ఏక ప‌క్ష విజ‌యంతో ఢిల్లీని ఓడించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 199 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటాడు. అర్ష‌ద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. అనంత‌రం ఛేజింగ్ ను కేవ‌లం 19 ఓవ‌ర్ల‌లో వికెట్లేమీ న‌ష్ట పోకుండా 205 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ అజేయ సెంచ‌రీ ( 61 బంతుల్లో 108 నాటౌట్, 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచ‌రీతో స‌త్తా చాటాడు. తాజా విజ‌యంతో 18 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి జీటీ మ‌ళ్లీ వ‌చ్చింది. 

రాహుల్ వ‌న్ మేన్ షో..టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ స్లోగా స్టార్ట్ చేసింది. ఆరంభంలోనే ఫాఫ్ డుప్లెసిస్ (5) వికెట్ కోల్పోయి, కాస్త ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఈ ద‌శ‌లో రాహుల్ అభిషేక్ పోరెల్ (30) జంట జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఓ ఎండ్ లో పొరెల్ దూకుడుగా ఆడ‌గా, రాహుల్ కాస్త టైం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత త‌ను కూడా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 90 ప‌ర‌ుగులు జోడించాడు. ఈ క్ర‌మంలో 35 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత పోరెల్ వెనుదిరిగినా, కెప్టెన్ అక్ష‌ర్ పటేల్ (25), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (21 నాటౌట్)  వేగంగా ఆడి, రాహుల్ కు మ‌ద్ధ‌తుగా నిలిచారు. మ‌రో ఎండ్ లో ఫిఫ్టీ త‌ర్వాత గేర్ మార్చిన రాహుల్ వేగంగా ఆడి, ఐపీఎల్ లో ఐదో సెంచ‌రీ పూర్తి చేశాడు. 

సుద‌ర్శ‌న్-గిల్ దూకుడు.. కాస్త భారీ టార్గెట్ తోనే బ్యాటింగ్ ప్రారంభించిన గుజ‌రాత్ కు ఓపెన‌ర్లు సుద‌ర్శ‌న్, కెప్టెన్ శుభ‌మాన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్, 3 ఫోర్లు 7 సిక్స‌ర్లు) మ‌రో వికెట్ పడ‌కుండా విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. ఆరంభం నుంచి ఢిల్లీ బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగి, వారిని ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేశారు. ఓ ఎండ్ లో గిల్ యాంక‌ర్ ఇన్నింగ్స్ ఆడ‌గా, సుద‌ర్శ‌న్ మాత్రం ఆది నుంచి వేగంగా ఆడాడు. ఈ క్ర‌మంలో 30 బంతుల్లో సుద‌ర్శ‌న్, 33 బంతుల్లో గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఇరువురు గేర్ మార్చారు. ముఖ్యంగా సుద‌ర్శ‌న్ ఏ బౌల‌ర్ ను లెక్క చేయ‌కుండా సిక్స‌ర్లతో విరుచుకు ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో 56 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆఖ‌ర్లో త‌గిన‌న్ని ప‌రుగులు లేక‌పోవ‌డంతో గిల్ కు సెంచ‌రీ చేసే భాగ్యం ద‌క్క‌లేదు. త‌ను శ‌త‌కానికి ఏడు ప‌రుగుల దూరంలో నిలిచాడు. మ‌రోవైపు వికెట్ పోకుండా అత్య‌ధిక ఛేద‌న ఇదే కావ‌డం విశేషం.  ఈ విజ‌యంతో గుజ‌రాత్ తోపాటు ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. మూడు జ‌ట్లు నాకౌట్ కు చేర‌డంతో మిగ‌తా ఒక బెర్త్ కోసం ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటీ ప‌డుతున్నాయి.