KL Rahul Century, DC vs GT: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో టి20లో 8000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న భారత క్రికెటర్ గా నిలిచాడు. గతంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డు రాహుల్ బద్దలు కొట్టాడు. కే.ఎల్ రాహుల్ అజయ్ శతకంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 199 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ 257 మ్యాచ్‌లాడగా 243వ ఇన్నింగ్స్‌లో T20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌కు నేటి మ్యాచ్ 237వ మ్యాచ్, కాగా 224వ ఇన్నింగ్స్. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్ ప్రస్తుతం 7967 పరుగులతో ఉన్నాడు. మరో 33 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో 5వ బంతిని సిక్సర్ గా మలచడంతో టీ20 కెరీర్ లో 8000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. అనంతరం 60 బంతుల్లోనే ఐపీఎల్ శతకం నమోదు చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో రాహుల్ కిది 5వ శతకం. కాగా, ఓవరాల్‌గా టీ20ల్లో  రాహుల్ 7 శతకాలు, 68 అర్ధశతకాలు సాధించాడు.

ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 217 మ్యాచ్‌లలో కేవలం 213 ఇన్నింగ్స్‌లలో టీ20 ఫార్మాట్లో 8వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ అజం 227 మ్యాచ్‌లు, 218 ఇన్నింగ్స్‌లలో T20లో 8 వేల పరుగులు చేశాడు. రాహుల్ 224వ ఇన్నింగ్స్ లో పొట్టి ఫార్మాట్లో 8000 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శతకాలు నమోదు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 8 సెంచరీలు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. జాస్ బట్లర్ 7 సెంచరీలు, క్రిస్ గేల్ 6 సెంచరీలు మాత్రమే కేఎల్ రాహుల్ (5) కంటే ముందున్నారు.

ఢిల్లీ ఇన్నింగ్స్ నడిపించిన రాహుల్

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ డుప్లెసిస్ (5) త్వరగా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్ (19 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ నడిపించాడు రాహుల్. అనవసర షాట్లకు పోకుండా, వీలు చిక్కినప్పుడల్లా బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో టీ20ల్లో వేగవంతంగా 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. సాయి కిశోర్ బౌలింగ్ లో పోరెల్ ఔటైనా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (25)తో కలిసి రన్ రేట్ తగ్గకుండా చూశాడు. అక్షర్ పటేల్ ను ప్రసిద్ కృష్ణ బోల్తా కొట్టించాడు. మరో ఎండ్ లో రాహుల్ అలవోకగా బ్యాటింగ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్) సహకారం అందించడంతో శతకం నమోదు చేశాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో 92 వద్ద సిక్స్ బాదాడు. తరువాత ఫోర్ కొట్టి 60 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు రాహుల్. 65 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 14 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.