Rohit Sharma Birthday Today: ఎక్కడో, దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు  అక్కడ మనమాతృ భాష వినిపిస్తే అబ్బ ఎంత ఆనందమో కదూ.  ఏదో ఒక అద్భుతం సాధించిన వ్యక్తి మనవాడే అని తెలిస్తే ఎంత  సంతోషమో కదా.. రోహిత్ శర్మ(rohit Sharma) విషయంలోనూ అంతే.. శర్మ అనే పేరు వినగానే  తెలుగువాడేమో అనే డౌట్ వస్తుంది. మీరు డౌట్ పడక్కర్లేదు నిజంగా రోహిత్ శర్మ తెలుగు మూలాలు ఉన్న వాడే . రోహిత్  త‌ల్లి పూర్ణిమ శ‌ర్మ ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లోని విశాఖ‌ప‌ట్నంకు(Visakhapatnam) చెందిన‌వారే. తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్ర(Maharastra) కు చెందిన వ్యక్తి. దీంతో రోహిత్ కు  తెలుగు  తెలుసు. ఐపీఎల్‌ సందర్భంగా హైదరాబాద్ కి వచ్చిన రోహిత్ వచ్చిన ప్రతిసారీ రెండు మాటలైనా తెలుగులో మాట్లాడి అందరినీ ఆనందింప చేస్తాడు. రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి పూర్ణిమ.. ఓ క్యూట్ ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. యంగ్ హిట్ మ్యాన్ ఫొటో అది. తన కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఈ ఫొటో షేర్ చేశారు.
 


హిట్ ‌మ్యాన్‌గా అభిమానులు పిలుచుకునే రోహిత్ శర్మ నేడు  37 వ  పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.  1987 ఏప్రిల్ 30వ తేదీన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు రోహిత్ శర్మ. 1999లో తొలిసారిగా బ్యాట్ పట్టారు. 2006 నాటికి జాతీయ జట్టులో చోటు సాధించారు. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు రోహిత్ క్రికెట్‌ ప్రపంచంలో అతనో హిట్‌మ్యాన్‌... మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక అటగాడు... సిక్సర్లను సింగిల్స్‌ తీసినంత ఈజీగా కొట్టగల విధ్వంస బ్యాటర్‌.. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లిన సారధి. అతను బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు హడల్‌. బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి టీమిండియా విజయానికి బాటలు వేసే అసలు సిసలు బ్యాటర్‌.  వ్యక్తిగత రికార్డులకంటే జట్టు విజయాలకే ప్రాధాన్యత ఇచ్చే అద్భుతమైన నాయకుడు. 


అతనో స్పూర్తి ప్రదాత 


క్రికెట్ ను అమితంగా ప్రేమించే రోహిత్  ఆటగాళ్ల మానసిక స్థితి తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వారిలో స్ఫూర్తినింపుతాడని చెబుతారు జట్టు సభ్యులు. రోహిత్   కెప్టెన్సీలో ఆడుతుండటం వల్ల తాము  చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నామని చెబుతుంటారు. అంత ఎందుకు రాజస్థాన్ వర్సెస్ ముంబై ఐపిఎల్ మ్యాచ్ లో  యశస్వి జైశ్వాల్ సెంచరీ కొట్టేసి ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ గెలిస్తే...ఆ ముంబైకి మాజీ కెప్టెన్ అండ్ లెజెండరీ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ..జైశ్వాల్ సెంచరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. సెంచరీ తర్వాత విన్నింగ్ షాట్ కొట్టి రాజస్థాన్ ను యశస్వి గెలిపించిన వెంటనే  రోహిత్ శర్మ దగ్గరకు సంతోషంగా వెళ్లి హగ్ చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఫెయిల్యూర్ కి ఇక గుడ్ బై చెప్పేసినట్లు వాళ్లిద్దరూ చాలా సంతోషంగా కనిపించిన ఫోటోస్, యశస్వి రోహిత్ బాండింగ్ అంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులు  తెగ వైరల్  అయ్యాయి. 


అందుకే రోహిత్ శర్మ పుట్టిన రోజు అంటే టీం తో సంబంధం లేకుండా అన్నీ ఐపిఎల్ జట్లు విషెస్ చెప్పాయి. స్పెషల్ పోస్ట్ లు పెట్టాయి. అభిమానుల శుభాకాంక్షలతో, తోటి క్రికెటర్ల అభినందనలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.