Rohit Sharma News: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కు అరుదైన ఘనత దక్కింది. తన సొంత గ్రౌండ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండుకు తన పేరు పెట్టారు. తన కుటుంబ సభ్యులు సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో రోహిత్ ఎమోషనల్ గా మాట్లాడాడు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి ముంబై తరపున, ఇండియా తరపున ఆడాలని ఎన్నో కలలు కన్నానని, వాంఖెడే స్టేడియంలో తన పేరిట స్టాండ్ ఉండటం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు. ముంబై స్టేడియంలో గతంలో సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, సునీల్ గావస్కర్, దిలీప్ వెంగసర్కర్ పేర్లతో స్టాండును నిర్మించారు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ కూడా చేరాడు.
ఎదురు చూస్తున్నా..ఈ స్టేడియంలో స్టాండును తన పేరిట నెలకొల్పడంతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుదామా అని ఎదురు చూస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో భాగంగా ఈనెల 21న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సోదరుడి కుటుంబం ముందర ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక తనకు ఈ గౌరవాన్ని కల్పించిన ఎంసీఏ కార్యవర్గానికి థాంక్స్ తెలిపాడు. అలాగే భారత్ కు ఆడాలనే తన కల ద్వారా ఇలాంటి గౌరవాన్ని పొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో రోహిత్ కుంటుంబ సభ్యులతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజకీయ నాయకులు, క్రికెటర్లు పాల్గొన్నారు.
రోహిత్ చమక్కులు...ఇక స్టేడియంలో సాధన చేస్తున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్లు.. రోహిత్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వాళ్లను ఉద్దేశించి రోహిత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు చాలా ఓపికగా తన ప్రసంగాన్ని విన్నందుకు థాంక్సని, ఇక ట్రైనింగ్ మొదలు పెట్టమని సరదాగా వ్యాఖ్యానించాడు. మరోవైపు టెస్టు ఫార్మాట్ కు ఈనెల తొలి వారంలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ బహిరంగ వేదికలపై మాట్లాడటం ఇదే తొలిసారి. గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్.. తాజాగా టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం తను కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు తను ఆడే అవకాశముంది. వన్డే జట్లుకు రోహితే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.