Rohit Sharma Opens Up On Retirement Plans: భారత్‌(Bharat) వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌(World cup)లో అసలు సిసలు హీరో కచ్చితంగా సారధి రోహిత్‌ శర్మనే (Rohit sharma). ఆరంభంలోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరు చేసేందుకు హిట్‌ మ్యాన్‌ బలమైన పునాదిని వేశాడు. రికార్డులు, శతకాల గురించి ఆలోచనే లేకుండా భారత్‌కు ప్రపంచకప్‌ అందించడానికి చేయాల్సిందంతా చేశాడు. రోహిత్‌ శర్మ విధ్వంసంతోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచిపోయింది. కప్పు గెలవకపోయినా రోహిత్‌ శర్మ నాయకత్వం... ఆటతీరు ఈ ప్రపంచకప్‌నే ప్రత్యేకంగా నిలిపింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ కప్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని ఘనత. అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు హిట్‌మ్యాన్. అయితే ఈ పరాజయం తర్వాత రోహిత్ శర్మ వచ్చే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. 2027 ప్రపంచకప్‌ నాటికి రోహిత్‌కు 40 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. 40 ఏళ్ల వయసులో రోహిత్‌ శర్మ వచ్చే ప్రపంచకప్‌లో జట్టులో ఉండడం అంత తేలికైన విషయమేమీ కాదని మాజీలు అంచనా వేశారు. అయితే దీనిపై తొలిసారి రోహిత్ శర్మ స్పందించాడు.


హిట్ మ్యాన్‌ ఏమన్నాడంటే..?
తాను వన్డే ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటున్నానని రోహిత్‌ శర్మ తేల్చి చెప్పాడు. ఆటకు ఇప్పుడే గుడ్‌ బై చెప్పాలని అనుకోవట్లేదని ఓ యూ ట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుందని పరోక్షంగా వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోహిత్‌.. వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. ప్రస్తుతం నా రిటైర్మెంట్‌ గురించి ఆలోచించడం లేదని.. జీవితం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదన్నాడు. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నానని.. వన్డే ప్రపంచకప్‌ గెలవాలనుందని రోహిత్‌ తెలిపాడు. 2025లో లార్డ్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతుందని.. అక్కడి వరకు కచ్చితంగా వెళ్తామని హిట్‌మ్యాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో తాము మెరుగ్గానే ఆడామని రోహిత్‌ తెలిపాడు. సెమీస్‌ గెలిచినప్పుడు కప్‌నకు మరో అడుగు దూరంలోనే ఉన్నామని అనుకున్నానని. కానీ ఫైనల్లో తమ ఓటమికి ఒక్క కారణం కూడా కనిపించలేదని రోహిత్‌ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అందరికీ ఓ చెడు రోజంటూ ఉంటుందని.... మంచి క్రికెట్‌ ఆడినా, ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా ఆ ఫైనల్‌ మనది కాని ఓ రోజుగా మిగిలిపోయిందన్నాడు. 


అలా అనిపిస్తే రిటైర్‌ అవుతా...
రిటైర్‌మెంట్‌ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ... టీమిండియా(England) సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోనని, ఇక చాలని అనిపించిన రోజు వెంటనే రిటైరవుతానని తేల్చి చెప్పాడు. దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తానొక రోజు నిద్ర లేవగానే.. ఇ ఆటకు సరిపోను అనిపిస్తే వెంటనే నేను దాని గురించి మాట్లాడతానని రోహిత్‌ తెలిపాడు. అందరికీ విషయం చెప్తానని కూడా వెల్లడించాడు. నిజాయతీగా చెప్పాలంటే గత రెండేళ్లలో తన ఆట ఇంకా ఉన్నత స్థాయికి చేరిందని రోహిత్‌ తెలిపాడు. ప్రస్తుతం తాను అత్యుత్తమ క్రికెట్‌ ఆడుతున్నాని రోహిత్‌ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లు గణాంకాల గురించి ఆలోచించని సంస్కృతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తునట్లు రోహిత్‌ తెలిపాడు. గణాంకాలను జట్టుకు దూరంగా ఉంచాలన్నది తన ఉద్దేశమని రోహిత్‌ అన్నాడు. ఒక మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాలి, సెంచరీ చేయాలి అనుకోవడం మంచిదే. కానీ దాని మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు’’ అని రోహిత్‌ అన్నాడు.