RCB VS PBKS Match Uptades: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్.సీ.బీ గెలిచి నిలిచి.. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు దారుణమైన ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి పంజాబ్ వైదొలిగింది.  ధర్మశాలలో గురువారం  జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై బెంగుళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  బెంగుళూరు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ టీమ్ 181 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ 2024లో పంజాబ్ పోరాటం ముగిసింది. ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు ఆడుకోవడం తప్ప ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉండబోవడంలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో తడబడ్డ పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటయ్యింది. 


17 ఓవర్లకే చేతులెత్తేసి.. 


పంజాబ్ బ్యాట్స్‌మన్ లో రిలీ రోసో 61(27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) తప్ప ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఒక్కసారి రోసో అవుటయ్యాక.. శశాంక్ సింగ్ 37(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)  మినహా బ్యాట్స్‌మన్ ఎవరూ ప్రభావం చూపలేదు. దీంతో పేకమేడలా కూలిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ 17 ఓవర్లకే చేతులెత్తేసింది. 21 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న రిలీ రోసో 61 పరుగుల వద్ద కరణ్ శర్మ బౌలింగ్‌లో విల్ జాక్స్ పట్టిన క్యాచ్ ద్వారా అవుటయ్యాడు. అంతకు ముందు  స్వప్నిల్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే  పంజాబ్ తరఫున తొలి వికెట్‌గా ప్రభ్ సిమ్రన్ 6 (4) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తరువాత ఇన్నింగ్స్  ఆరో ఓవర్లో ఫెర్గుసన్ బౌలింగ్‌లో బెయిర్ స్టో   మిస్ టైమ్ చేసిన బంతిని డుప్లెసిస్ వెనక్కి పరిగెడుతూ వెళ్లి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 27 (16) పరుగుల అతని ఇన్నింగ్స్‌కి తెరపడింది. వీళ్లతో పాటు కెప్టెన్ సామ్ కరణ్ 22 (16) మినహా పంజాబ్ ప్లేయర్లు ఎవ్వరి స్కోరూ రెండంకెలు దాటలేదు. ఆర్ సీబీ బౌలర్లలో సిరాజ్‌కు మూడు వికెట్లు, స్వప్నిల్,ఫెర్గుసన్, కర్ణ్ లకు తలో రెండు వికెట్లు పడ్డాయి.  అంతకుముందు కొహ్లీ 92(47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు). రజిత్ పటిదార్ 55(23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ 46 (27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ ) మెరవడంతో బెంగుళూరు.. పంజాబ్ ముందు 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.  పంజాబ్ బౌలర్ హర్షల్ పాటిల్‌కు చివరి ఓవర్‌లో మూడు వికుట్లు దక్కాయి. డెబ్యుడెంట్ కావేరప్పకు 2, అర్షదీప్, కరణ్ లకు తలో వికెట్ పడ్డాయి. 


పవర్ ప్లే ముగిసే వరకు ఆశగానే ఉంది.. 


పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ స్కోర్.. 75/2. అంటే బెంగుళూరు కంటే మెరుగైన స్టేజ్‌లో ఉంది. 107 పరుగుల వద్ద మూడో వికెట్‌గా రోసో అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచీ ఎప్పుడూ పంజాబ్ గేమ్‌లో గెలిచేట్లు కనపడలేదు. 125, 126, 151, 164,170,174, 181 ఇలా స్వల్ప రన్స్ తేడాతోనే వరసపెట్టి వికెట్లు పడ్డాయి. 


ప్లే ఆఫ్ ఆశలు ఎవరికలా.. 


ఈ మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది. ముంబై తరువాత ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలగిన రెండో టీమ్ ‌గా పంజాబ్ నిలిచింది.  ఇక బెంగుళూరు విషయానికొస్తే..  60 పరుగుల తేడాతో గెలవడంతో రన్ రేట్ మెరుగు పడింది. అలాగే గెలిచినందుకు రెండు పాయంట్లు అదనంగా యాడ్ అయ్యాయి. అయినా ఇంకా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలోనూ కొనసాగుతుంది. బెంగుళూరు ప్లే ఆఫ్స్ కి చేరాలంటే సీఎస్ కే ఆడబోతోన్న రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాలి. బెంగుళూరే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలవాలి.