ఆర్ సీ బీ ప్రత్యర్థి పంజాబ్‌ ముందు 242 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కోహ్లీ కన్సిస్టెన్సీ, పటీదార్ ధనాధన్ ఇన్నింగ్స్, గ్రీన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ మెరుపులు వెరసి పంజాబ్‌కు చెమటలు పట్టించే టొటల్ ఫస్ట్ ఇన్నింగ్‌లో పోస్టయ్యింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ పవర్‌ప్లే లో ప్రత్యర్థి ఆర్ సీ బీని బాగానే కట్టడి చేసింది. తొలి అయిదు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి బ్యాటర్లను ఒత్తిడిలోనికి నెట్టి వేసింది. పంజాబ్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడుతోన్న సీమర్ కావేరప్ప వరుస ఓవర్లలో డుప్లెసిస్- 9(7), విల్ జాక్స్- 12(7) లను ఔట్ చేశాడు. మొదటి ఆరు ఓవర్లలో ఆర్ సీ బీ స్కోరు 56/2.


మూడు క్యాచ్ డ్రాప్‌లు


అయితే ఈ మ్యాచ్‌లో కావేరప్ప బౌలింగ్‌లో కోహ్లీకి రెండు సార్లు లైఫ్‌లు వచ్చాయి. తొలి ఓవర్ మూడో బంతికే కోహ్లీ లాఫ్టెడ్ షాట్ కొట్టబోయి ఎడ్జ్ అవ్వడంతో బంతి గాల్లోకి లేచింది. అయితే..అశుతోష్ శర్మ ఆ బంతి దగ్గరికి చేరుకెలేక క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే కోహ్లీకి రెండో లైఫ్ కూడా కావేరప్ప బౌలింగ్‌లోనే వచ్చింది.మూడో ఓవర్‌లో కావేరప్ప వేసిన బంతిని కవర్ డ్రైవ్ చేసేందుకు ట్రై చేసిన కోహ్లీ దాదాపు రొస్సో చేతికి చిక్కి పోయాడు. చేతిలో పడ్డ బంతి చేజారడంతో కోహ్లీకి మరో లైఫ్ దొరికింది. డుప్లెసిస్, విల్ జాక్స్ అవుటయ్యాక..  క్రీజులోకి వచ్చిన పటీదార్ కూడా ఓ సారి క్యాచ్ డ్రాప్ ద్వారా లైఫ్ పొందాడు. కావేరప్ప బౌలింగ్‌లో పటీదార్ పుల్ షాట్  కొట్టడంతో బాల్ నేరుగా హర్షల్ చేతిలో పడింది. ఈజీ క్యాచ్‌ని హర్షల్ వదిలేశాడు.


పటీదార్ ధనాధన్ ఇన్నింగ్స్


తనకు దొరికిన లైఫ్‌ని పటీదార్ చక్కగా వినియోగించుకొని పంజాబ్‌కు చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. కోహ్లీకి తోడై పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కావేరప్ప వేసిన మ్యాచ్ ఏడో ఓవర్‌లో రెండు సిక్సర్లతో 16 పరుగులురాగా,  ఎనిమిదో ఓవర్లో మూడు సిక్సర్లతో 18 పరుగులొచ్చాయి. అర్షదీప్ వేసిన తొమ్మిదో ఓవర్‌లోనూ 16 పరుగులొచ్చాయి.  మాంచి టచ్‌లో ఉన్న పటీదార్ ఇన్నింగ్స్‌కు పదో ఓవర్‌ చివరి బంతికి తెరపడింది.   హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక.. పటిదార్ 55 (23) శామ్ కరన్ బౌలింగ్‌లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పది ఓవర్లు పూర్తయ్యాక ఆర్సీబీ స్కోరు 119/3. పదకొండో ఓవర్ మొదలవ్వక ముందే వడగళ్ల వాన రావడంతో మ్యాచ్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. 


కన్సిస్టెంట్ కోహ్లీ.. 


మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక.. ఆర్ సీ బీ ఇన్నింగ్స్ కొంత నెమ్మదించింది. పటీదార్ స్థానంలో వచ్చిన కేమరూన్ గ్రీన్ నెమ్మదిగా ఆడుతూ కోహ్లీకి సపోర్ట్ చేశాడు, దీంతో.. 32 బంతుల్లో  హాఫ్ సెంచరీ పూర్తి  చేసుకున్న కోహ్లీ ఆ తరువాత బ్యాట్ స్పీడు పెంచాడు. వరస బౌండరీలతో విరుచుకపడ్డాడు. అద్భుతమైన క్లాస్ ప్రదర్శిస్తూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.  16 వ ఓవర్లో 19 రన్లు, పదిహేడో ఓవర్‌లో 15 రన్లు సాధించాక.. అర్షదీప్ వేసిన 18వ ఓవర్‌లో ఒక ఫోర్, ఆ వెంటనే సిక్స్ కొట్టిని కోహ్లీ 92(47) సెంచరీకి చేరువై రికార్డు సృష్టిస్తాడనుకున్న తరుణంలో ప్రేక్షకుల్ని నిరాశకు గురిచేస్తూ వెనుదిరిగాడు.  అర్షదీప్ వేసిన బంతికి  డీప్ కవర్‌లో రోస్సోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేసేశాడు. అప్పటికే టీమ్ స్కోరు 211.


చివరి ఓవర్లో హర్షల్‌కి మూడు వికెట్లు


ఆ తరువాత సైతం గ్రీన్, దినేశ్ కార్తీక్ బంతిని ఉతికి ఆరేయడంతో 19వ ఓవర్‌లో 21 పరుగులొచ్చాయి. చివరి ఓవర్ హర్షల్ పటేల్ అద్భుతంగా వేయడంతో కేవలం మూడు పరుగులొచ్చాయి. చివరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్-18(7), గ్రీన్ 46(27) లతో పాటు మహిపాల్-0(2) లను హర్షల్ ఔట చేశాడు.  మొత్తం మీద ఆర్ సీ బీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. గెలిచేందుకు పంజాబ్ 242 పరుగులు సాధించాలి.