Royal Challengers Bangalore vs Gujarat Titans: ఐపీఎల్ లీగ్ దశకు అదిరిపోయే ముగింపు లభించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ ఓడించి ఇంటికి పంపించేసింది. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ పాలిట వరం అయింది. వారు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.


గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్: 52 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) అజేయమైన సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 61 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరికీ ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. వీళ్లిద్దరూ గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే సెంచరీలు సాధించారు.


అదర గొట్టిన గిల్, విజయ్ శంకర్
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ వృద్ధిమాన్ సాహాను (12: 14 బంతుల్లో, రెండు ఫోర్లు) మహ్మద్ సిరాజ్ మూడో ఓవర్లో అవుట్ చేశాడు. కానీ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్: 52 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ విజయ్ శంకర్ బెంగళూరు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.


విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదట నెమ్మదిగా ఆడినా, క్రమంగా జోరు పెంచాడు. వీరు రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించి గుజరాత్‌ను గెలుపు బాట పట్టించారు. ఈ లోపే వీరిద్దరూ తమ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ దశలో విజయ్ శంకర్ అవుటైనా... గిల్‌ను ఆపడం బెంగళూరు వల్ల కాలేదు. విజయ్ శంకర్ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక ఎండ్‌లో వికెట్లు కోల్పోతున్నా మరో ఎండ్‌లో గిల్ నిలబడి మ్యాచ్ గెలిపించాడు.


ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యానికి తోడు ఎక్స్‌ట్రాలు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంప ముంచాయి. ఏకంగా 19 ఎక్స్‌ట్రాలను ఆర్సీబీ సమర్పించుకుంది. నిర్ణయాత్మకమైన చివరి ఓవర్లో కూడా మొదటి బంతికి నోబాల్, ఆ తర్వాత వైడ్‌ను వేన్ పార్నెల్ బౌల్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ బౌలర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతిని గిల్ సిక్సర్‌గా మలిచి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా గెలిపించాడు.


విరాట్ వన్ మ్యాన్ షో...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పటిలానే ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్ (28: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ బెంగళూరు అద్భుతమైన ఆరంభం అందించారు. మొదటి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (11: 5 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వచ్చీ రాగానే బౌండరీ, సిక్సర్‌తో చెలరేగినా తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. మహీపాల్ లొమ్రోర్ (1: 3 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. దీంతో బెంగళూరు 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్ (26: 16 బంతుల్లో, ఐదు బంతుల్లో) ఆర్సీబీని ఆదుకున్నారు. స్కోరు వేగం తగ్గకుండా బౌండరీలు కొట్టారు. ముఖ్యంగా కోహ్లీ చాలా ప్లానింగ్‌తో ఆడాడు. బంతిని ఎక్కువ గాల్లోకి కొట్టకుండా వీలైనంత వరకు గ్రౌండెడ్‌గా ఆడాడు. ఈ దశలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం మైకేల్ బ్రేస్‌వెల్‌ను షమీ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. దినేష్ కార్తీక్  (0: 1 బంతి) కూడా వెంటనే అవుటయ్యాడు. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది.


అనంతరం విరాట్ కోహ్లీకి అనుజ్ రావత్ (23 నాటౌట్: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) తోడయ్యాడు. అనుజ్ రావత్ స్ట్రైక్ రొటేట్ చేయగా, విరాట్ కోహ్లీ స్ట్రైకింగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విరాట్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత అనుజ్ రావత్ సిక్సర్, ఫోర్ కొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.