Vivrant Sharma: ఐపీఎల్ - 16 లీగ్ దశ ముగింపులో మరో కొత్త హీరో పుట్టుకొచ్చాడు. వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ముగిసిన హైస్కోరింగ్ గేమ్‌లో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డ వివ్రంత్ శర్మ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే హైదరాబాద్‌ను భారీ తేడాతో ఓడించాల్సిన మ్యాచ్‌లో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఉన్నది కాసేపే అయినా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి ముంబై బౌలింగ్‌ను ఉతికారేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేసిన వివ్రంత్ శర్మ ఎవరు..? సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
ఎవరీ వివ్రంత్..?
ఈ సీజన్‌కు ముందు కొచ్చి వేదికగా నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్... వివ్రంత్ ను రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ బ్యాటింగ్ ఆల్ రౌండర్.. 2021లో దేశవాళీలో ఎంట్రీ ఇచ్చాడు. 2021 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ తరఫున తన తొలి లిస్ట్- ఎ గేమ్ సౌరాష్ట్రపై కోల్‌కతా వేదికగా ఆడాడు. తన తొలి మ్యాచ్‌లో 66 పరుగులు చేసిన వివ్రంత్.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు కూడా తీశాడు.
2021 నవంబర్ లో టీ20లలో ఆంధ్రాపై ఎంట్రీ ఇచ్చిన వివ్రంత్.. సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈ ఫార్మాట్ లో 13 మ్యాచ్ లు ఆడాడు. ఏడు ఫస్ట్ క్లాస్ గేమ్స్, 14 లిస్ట్ - ఏ మ్యాచ్ లు ఆడాడు. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జమ్మూకాశ్మీర్ - ఉత్తరాఖండ్ మధ్య జరిగిన సెమీస్ లో 124 బంతుల్లోనే 154 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దేశవాళీలో రాణిస్తున్న అతడిని సన్ రైజర్స్ మినీ వేలంలో రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్‌లో..
ఐపీఎల్ లో జమ్మూ కాశ్మీర్ కే చెందిన ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ లు వివ్రంత్ సహచర ఆటగాళ్లే. సమద్.. తనతో పాటు వివ్రంత్ ను కూడా సన్ రైజర్స్ ప్రాక్టీస్ కు తీసుకొచ్చేవాడట. ఈ ఏడాది మే 13న హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో అతడు ఎంట్రీ ఇచ్చాడు. కానీ లక్నోతో పాటు, రాజస్తాన్ తో మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆడుతున్నది మూడో టీ20 అయినప్పటికీ బ్యాటింగ్ చేయడం ముంబైతో మ్యాచ్‌లోనే ఫస్ట్.
ఫస్ట్ మ్యాచ్‌లో రికార్డు..
ముంబైతో మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 69 పరుగులు చేసిన వివ్రంత్.. తద్వారా పలు రికార్డులు నమోదు చేశాడు. డెబ్యూ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా వివ్రంత్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు.. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ స్వప్నీల్ అస్నోడ్కర్ (60) పేరిట ఉండేది. 15 ఏండ్ల తర్వాత ఈ రికార్డును వివ్రంత్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడుతూ గౌతం గంభీర్.. 58 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.