Royal Challengers Bengaluru won by 47 runs: ఐపీఎల్‌(IPL) రెండో అర్ధ భాగంలో అదరగొడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) వరుసగా అయిదో విజయం నమోదు చేసింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ(DC)ని... బెంగళూరు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు...  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ... బెంగళూరు  బౌలర్ల ముందు తేలిపోయింది. 19.1 ఓవర్లలో కేవలం 140 పరుగులే చేసి ఢిల్లీ ఆలౌట్‌ అయింది. దీంతో 47 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు 6 మ్యాచ్ లు నెగ్గి 12 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ వల్ల 5వ స్థానానికి ఎగబాకింది.


 

మెరిసిన బెంగళూరు బ్యాటర్లు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బెంగళూరుకు మొదట్లోనే రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆరు పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు సారధి డుప్లెసిస్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపటికే బెంగళూరుకు గట్టి షాక్‌ తగిలింది. మంచి ఊపు మీదున్న విరాట్‌ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. 13 బంతుల్లో 27 పరుగులు చేసిన కోహ్లీ... ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కానీ రజత్ పాటిదార్ (52) అర్థశతకంతో అదరగొట్టడంతో పాటు విల్ జాక్స్ (41), గ్రీన్ (32), విరాట్ కోహ్లీ (27) మెరుగ్గా రాణించారు.

రజత్ పాటిదార్, విల్ జాక్స్ కలిసి.. డీల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓవైపు ఆచితూచి ఆడుతూ.. మరోవైపు బౌండరీలతో విరుచుకుపడ్డారు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో పాటిదార్‌ 52 పరుగులు చేసి అవుటయ్యాడు. రసిక్‌ సలామ్‌ వేసిన పదమూడో ఓవర్‌లో రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. దీంతో 88 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే విల్‌ జాక్స్‌ కూడా అవుటయ్యాడు. 29 బంతుల్లో 41 పరుగులు చేసిన జాక్స్‌... కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 138 పరుగుల వద్ద బెంగళూరు నాలుగో వికెట్‌ కోల్పోయింది.  ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18వ ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌ను.. మహిపాల్‌ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత స్వప్నిల్‌ సింగ్‌ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న బెంగళూరు చివర్లో వికెట్లు కోల్పోయి... భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 1, ఖలీల్‌ అహ్మద్‌ 2, రసీక్‌ సలామ్‌ 2 వికెట్లు తీశారు.

 

కుప్పకూలిన ఢిల్లీ

అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు లక్ష్య చేధనలో చేతులెత్తేశారు. కేవలం 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. అక్షర్‌ పటేల్‌ 57 పరుగులతో పోరాడాడు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌ 3, ఫెర్గూసన్‌ 2, స్వప్నిల్‌, సిరాజ్‌, గ్రీన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఇది బెంగళూరు వరుసగా ఐదో విజయం కావడం విశేషం.