RCB vs DC Delhi Capitals Target 188 : ఢిల్లీ క్యాపిటల్స్(DC) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు(RCB) భారీ స్కోరు చేసింది. మరింత స్కోరు చేసే అవకాశం ఉన్నా చివర్లో ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడం... బెంగళూరు బ్యాటర్లు తడబడడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. రజత్ పాటిదార్, విల్ జాక్స్, కామోరూన్ గ్రీన్, విరాట్ కోహ్లీ పర్వాలేదనిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసింది.
ధాటిగా ఆడినా...
పంత్ లేకుండా బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే సిక్స్ బాదిన కోహ్లీ... ప్రత్యర్థి జట్టుకు హెచ్చరికలు పంపాడు. ఖలీల్ అహ్మద్ వేసిన రెండో ఓవర్‌లోనూ సిక్స్ బాదిన కోహ్లీ.... భారీ స్కోరుకు బాటలు వేశాడు. కానీ ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్‌లో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు సారధి డుప్లెసిస్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపటికే బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. మంచి ఊపు మీదున్న విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. 13 బంతుల్లో 27 పరుగులు చేసిన కోహ్లీ... ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం రజత్ పాటిదార్ ధాటిగా ఆడి బెంగళూరును భారీ స్కోరు దిశగా నడిపించాడు.
పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసి పటిష్ట స్థితిలోనే నిలిచింది. రజత్ పాటిదార్, విల్ జాక్స్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఎనిమిది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 87 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసింది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు పది ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం రజత్ పాటిదార్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో పాటిదార్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు. రసిక్ సలామ్ వేసిన పదమూడో ఓవర్‌లో రజత్ పాటిదార్ అవుటయ్యాడు. దీంతో 88 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే విల్ జాక్స్ కూడా అవుటయ్యాడు. 29 బంతుల్లో 41 పరుగులు చేసిన జాక్స్... కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 138 పరుగుల వద్ద బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది.
ఖలీల్ అహ్మద్... బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ను.. మహిపాల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత స్వప్నిల్ సింగ్ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న బెంగళూరు చివర్లో వికెట్లు కోల్పోయి... భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 1, ఖలీల్ అహ్మద్ 2, రసీక్ సలామ్ 2 వికెట్లు తీశారు.