IPL 2024, CSK vs RR innigs highlets : ప్లే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) బౌలర్లు రాణించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌(RR)ను కట్టడి చేశారు. భీకరమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్న రాజస్థాన్‌ను చెన్నై బౌలర్లు 141 పరుగులకే కట్టడి చేశారు. సిమ్రజీత్‌సింగ్‌ మూడు వికెట్లతో రాజస్థాన్‌ను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లందరూ రాణించారు. వికెట్లు తీయకపోయినా భారీగా పరుగులు సమర్పించుకోలేదు. మరోవైపు రాజస్థాన్‌లో రియాన్‌ పరాగ్‌ తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ 40 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. దీంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది.


 

కట్టుదిట్టమైన బౌలింగ్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభం నుంచే చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌ ఆచితూతి బ్యాటింగ్‌ చేశారు. తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలో 43 పరుగులు జోడించారు. తొలి ఆరు ఓవర్లలో కేవలం అయిదు ఫోర్లు, ఒక సిక్స్‌ మాత్రమే నమోదయ్యాయంటే చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పవర్‌ ప్లే ముగిసిన తర్వాత సిమర్‌జీత్‌ సింగ్‌.. మ్యాజిక్‌ ఆరంభమైంది. 21 బంతుల్లో 24 పరుగులు చేసిన యశస్వి జైస్వాలన్‌ సిమర్‌జిత్‌ సింగ్‌ తొలుత అవుట్‌ చేశాడు. సిమర్‌జీత్‌సింగ్‌ బౌలింగ్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ అవుట్‌ అయ్యాడు. యశస్వి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. అనంతరం కాసేపటికే జోస్‌ బట్లర్‌ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వేసిన మరోఓవర్‌లో సిమర్‌జిత్‌ సింగ్‌ బట్లర్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. 25 బంతుల్లో 21 పరుగులు చేసి బట్లర్‌ అవుటయ్యాడు. అనంతరం 15 పరుగులు చేసిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ను కూడా సిమర్‌జిత్‌ సింగ్ అవుటయ్యాడు. దీంతో 91 పరుగులకే రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం చెన్నై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం గగనమైపోయింది. ధ్రువ్‌ జురెల్‌ కాస్త ధాటిగా ఆడాడు. 18 బంతుల్లో ఒక ఫోరు, రెండు సిక్సులతో జురెల్‌ 28 పరుగులు చేశాడు. జురెల్‌ను తుషార్‌ దేశ్‌పాండే పెవిలియన్‌కు పంపాడు. శుభమ్‌ దూబే విఫలమయ్యాడు. ఒకే బంతి ఎదుర్కొని  శుభమ్‌ దూబే పెవిలియన్‌కు చేరాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన దేశ్‌ పాండే రాజస్థాన్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. కానీ రియాన్‌ పరాగ్‌ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది. 35 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సర్లతో పరాగ్‌ 47 పరుగులు చేశాడు. పరాగ్‌ స్కోరే... రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు  కావడం గమనార్హం. దీంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో సిమర్‌జిత్‌ సింగ్‌ మూడు, తుషార్‌ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశారు.