CSK vs RR Chennai Super Kings won by 5 wkts: ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి రాజస్తాన్‌ రాయల్స్‌(RR)పై ఘన విజయం సాధించింది. సమర్‌జీత్‌ సింగ్ సహా చెన్నై బౌలర్లు మెరిసిన వేళ తొలుత రాజస్థాన్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది. అనంతరం కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో చెన్నై అయిదు వికెట్లు కోల్పోయి మరో పది బంతులు ఉండగానే విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.


ఆట మొదట్లో స్టార్ ఆట‌గాడు  ర‌చిన్ ర‌వీంద్ర‌ వెనుదిరిగాక వ‌చ్చిన డారిల్ మిచెల్ కూడా  అటాకింగ్ గేమ్ ఆడాడు. అయితే.. చాహ‌ల్ అత‌డిని ఎల్బీగా ఔట్ చేయ‌గా.. 67 వ‌ద్ద సూప‌ర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ , శివం దూబే , ర‌వీంద్ర జ‌డేజా  లు త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగినా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంట‌రి పోరాటం చేశాడు.  మొత్తానికి  సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలిచి.. 14 పాయింట్లు సాధించింది.


రాజస్థాన్ ఇన్నింగ్స్: 


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే  ఆరంభం నుంచే చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో   ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌ ఆచితూతి బ్యాటింగ్‌ చేశారు. తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలో 43 పరుగులు జోడించారు. తొలి ఆరు ఓవర్లలో కేవలం అయిదు ఫోర్లు, ఒక సిక్స్‌ మాత్రమే నమోదయ్యాయంటే చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పవర్‌ ప్లే ముగిసిన తర్వాత సిమర్‌జీత్‌ సింగ్‌.. మ్యాజిక్‌ ఆరంభమైంది. 21 బంతుల్లో 24 పరుగులు చేసిన యశస్వి జైస్వాలన్‌ సిమర్‌జిత్‌ సింగ్‌ తొలుత అవుట్‌ చేశాడు. సిమర్‌జీత్‌సింగ్‌ బౌలింగ్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ అవుట్‌ అయ్యాడు. 


అనంతరం కాసేపటికే జోస్‌ బట్లర్‌  25 బంతుల్లో 21 పరుగులు చేసి  అవుటయ్యాడు.   15 పరుగులు చేసిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ను కూడా సిమర్‌జిత్‌ సింగ్ అవుట్ చేశాడు. దీంతో 91 పరుగులకే రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం చెన్నై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం గగనమైపోయింది. ధ్రువ్‌ జురెల్‌ కాస్త ధాటిగా ఆడాడు. 18 బంతుల్లో ఒక ఫోరు, రెండు సిక్సులతో జురెల్‌ 28 పరుగులు చేశాడు. జురెల్‌ను తుషార్‌ దేశ్‌పాండే పెవిలియన్‌కు పంపాడు. శుభమ్‌ దూబే విఫలమయ్యాడు. ఒకే బంతి ఎదుర్కొని  శుభమ్‌ దూబే పెవిలియన్‌కు చేరాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన దేశ్‌ పాండే రాజస్థాన్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. కానీ రియాన్‌ పరాగ్‌ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది. 35 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సర్లతో పరాగ్‌ 47 పరుగులు చేశాడు. పరాగ్‌ స్కోరే... రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు  కావడం గమనార్హం. దీంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో సిమర్‌జిత్‌ సింగ్‌ మూడు, తుషార్‌ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశారు.