IPL 2025 RCB Stunning Victory: చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ మరోసారి పై చేయి సాధించింది. తొలిసారి ఒక సీజన్ లో రెండు లీగ్ మ్యాచ్ ల్లో చెన్నైపై విజయం సాధించింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదో విజయంతో దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 2 పరుగులతో ఆర్సీబీ గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటాడు. మతీషా పతిరాణకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. లూంగీ ఎంగిడి మూడు వికెట్లతో సత్తా చాటాడు.
ఓపెనర్ల విధ్వంసం.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్లు స్టన్నింగ్ స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా జాకబ్ బెతెల్ (33 బంతుల్లో 55, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి కోహ్లీ పర్యాటక బౌలర్లను చితక్కొట్టాడు. వీరిద్దరూ రెచ్చి పోయి ఆడటంతో పవర్ ప్లేలోనే 71 పరుగులు వచ్చాయి. బౌలర్లను ఊచకోత కోసిన బెతెల్ 28 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని ఆ తర్వాత వెనుదిరిగాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత సిక్సర్లతో కోహ్లీ సందడి చేయడంతో పాటు 29 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో ఈ సీజన్ లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఇక కోహ్లీ వెనుదిరిగిన తర్వాత మిడిలార్డర్ విఫలమైనా చివర్లో రొమారియో షెఫర్డ్ విధ్వంసకర ఫిఫ్టీ (14 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) తో ఆర్సీబీకి భారీ స్కోరును అందించాడు. కేవలం 14 బంతుల్లో ఫిఫ్టీ చేసిన ఫెఫర్డ్ ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేయడం విశేషం.
మాత్రే జోరు..ఈ సీజన్ లో టీనేజర్ల జోరు కొనసాగుతుండటంతో మాత్రే కూడా అందులో పాలు పంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో తను ఆద్యంతం విధ్వంసకరంగా ఆడాడు. భువనేశ్వర్ తొలి ఓవర్లో 23 పరుగులు మాత్రే పిండుకోవడంతో సీఎస్కేకు అద్భుత శుభారంభం వచ్చింది. షేక్ రషీద్ (14) తో కలిసి ప్రత్యర్థి బౌలర్లను చితక్కొడుతూ తొలి వికెట్ కు 51 పరుగులు జోడించాడు. రషీద్ వెనుదిరిగినా, తన జోరు మాత్రం మాత్రే కొనసాగించాడు. రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు కదిలి, టార్గెట్ కరుగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో 25 బంతుల్లో మాత్రే, 29 బంతుల్లో జడేజా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వీరద్దరూ జోరు కొనసాగించారు. ఈ నేపథ్యంలో రెండో వికెట్ కు 114 పరుగులు జోడించి, సీఎస్కేను డ్రైవింగ్ సీట్ లోకి తీసుకువచ్చారు. అయితే సెంచరీకి చేరువైన మాత్రే.. అన్ లక్కీగా ఔటయ్యాడు. చివర్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (12) విఫలం కావడం, మిగతా బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడకపోవడంతో చెన్నైకి మరో ఓటమి తప్పలేదు. 180+ పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేని తన బలహీనతను చెన్నై మరోసారి చాటుకుంది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు రావాల్సి ఉండగా, కేవలం 12 పరుగులు మాత్రేమే చెన్నై చేయగలిగింది. దీంతో టోర్నీలో 9వ పరాజయాన్ని చెన్నై మూటగట్టుకుంది.