IPL 2025 RCB News: ఈ సీజన్ లో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కు పాల్పడినందుకుగాను టీమ్ కెప్టెన్ రజత్ పతిదార్ పై ఐపీఎల్ మేనేజ్మెంట్ కొరడా ఝళిపించింది. రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇక ఈ సీజన్ లో సారథిగా బాధ్యతలు స్వీకరించిన పతిదార్.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింటిలో ఆర్సీబీ విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్, ఐదుసార్లు చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లపై విజయం సాధించింది. ఒక్క గుజరాత్ టైటాన్స్ చేతిలో మాత్రమే పరాజయం పాలైంది. ఇక సారథిగా రజత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 161 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉండటం గమనార్హం.
జట్టులో స్థిరత్వం.. రజత్ ద్వారా బ్యాటింగ్ లైనప్ స్థిరత్వం వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేస్తూ, ఆకట్టుకుంటున్నాడని కొనియాడుతున్నారు. ఇక కెప్టెన్సీ భారం ఏమాత్రం లేకుండా, స్వేచ్ఛగా పరుగులు సాధిస్తున్నాడని, అలాగే కెప్టెన్సీలోనూ సత్తా చాటుతున్నాడని పేర్కొంటున్నారు. ముంబైతో మ్యాచ్ లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జోష్ హేజిల్ వుడ్ కాకుండా, యశ్ దయాల్ ను బౌలింగ్ కు దింపి అద్భుతమైన ఫలితం సాధించాడని ప్రశంసిస్తున్నారు. ఇక ప్రత్యర్థి బ్యాటింగ్ కు తగినట్లుగా బౌలర్లను బాగా యూస్ చేసుకుంటున్నాడని, ఈ సీజన్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో జట్టు పటిష్టంగా మారిందని కితాబిస్తున్నారు.
ఆటతీరు మారింది.. ఇక ఆర్సీబీ ఆటతీరులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఆటగాళ్ల షాట్ల ఎంపిక మారిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచే రిస్క్ తీసుకుంటున్నాడని, ప్రమాదకర షాట్లు ఆడటంలో వెనకాడటం లేదని పేర్కొన్నాడు. మెంటార్ గా దినేశ్ కార్తీక్ యువకులతో మాట్లాడి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడని ప్రశంసించాడు. అలాగే మిగతా ఆటగాళ్లు కూడా టైటిల్ సాధించాలంటే ఏం చేయాలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతున్నారని, దీంతో రజత్ కి కెప్టెన్సీ భారంగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. ఇక 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ.. గత 17 సీజన్లుగా టైటిల్ గెలవడంలో విఫలమైంది. మూడుసార్లు ఫైనల్ కి చేరినా, రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. టైటిల్ ఫేవరెట్ గా మారిందని పలువురు ప్రశంసిస్తున్నారు. గతేడాది ప్లే ఆఫ్స్ కు చేరినా, ఎలిమినేటర్ లోనే ఆర్సీబీ పరాజయం పాలైంది. ఈసారి మాత్రం టైటిల్ నెగ్గాలని ఆ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు.