IPL 2025 MI VS RCB Live Updates: ఆర్సీబీ సాధించింది. 12 ఏళ్ల తర్వాత వాంఖెడే కోటను బద్దలు కొట్టింది. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగులతో విజయం సాధించింది. దీంతో మూడో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో టాప్ -3కి చేరుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 221 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫిఫ్టీ (67)తో చెలరేగి, టీ20 ఫార్మాట్ లో 13వేల పరుగుల మార్కును దాటాడు. బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 56, 4 ఫోర్లు, 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్రునాల్ పాండ్యా నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
MI Vs RCB
ధనాధన్ ఆటతీరు.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆరంభంలోనే ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్ సాల్ట్ (4) ఆరంభంలోనే ఔటయ్యాడు. ఈ దశలో దేవదత్ పడిక్కల్ (37) తో మంచి భాగస్వామ్యాన్ని కోహ్లీ నెలకొల్పాడు. చాలా దూకుడుగా ఆడిన కోహ్లీ.. సూపర్ టచ్ లో కనిపించాడు. తొలుత 13 వేల పరుగులను ఈ ఫార్మాట్లో పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత ఐపీఎల్లో 58వ ఫిఫ్టీని కంప్లీట్ చేశాడు. వీరిద్దరూ 95 పరుగులు జోడించాక పడిక్కల్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 64, 5 ఫోర్లు, 4 సిక్సర్లు)తో సత్తా చాటగా, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కామియో తో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ 200 పరుగుల మార్కును చేరుకుంది. మిగతా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు రెండు వికెట్లు దక్కాయి.
తిలక్, పాండ్యా విధ్వంసం..ఇక ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కలేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (17) కాస్త మంచి టచ్ లోనే కన్పించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ర్యాన్ రికెల్టన్ (17) మరోసారి విఫలమయ్యాడు. విల్ జాక్స్ (22), సూర్య కుమార్ యాదవ్ (28) వేగంగా ఆడకపోగా, బంతులు వేస్ట్ చేశారు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన తిలక్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాచ్ గతినే మార్చేశారు. వీరిద్దరూ చాలా వేగంగా ఆడారు. ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ పరుగులు సాధించారు. దీంతో ఛేజింగ్ లో ముంబై చాలా ముందంజ వేసింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 34 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. దీంతో ముంబై వైపు మ్యాచ్ మొగ్గు చూపింది. అయితే వీరిద్దరూ మూడు బంతుల తేడాతో ఔటవడంతో ఉత్కంఠ రేగింది. చివర్లో మరికొన్ని వికెట్లు వేగంగా కోల్పోవడంతోపాటు నమన్ ధీర్ (11) విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. మిగతా బౌలర్లలో యశ్ దయాల్, జోష్ హేజిల్ వుడ్ కు రెండేసి వికెట్లు దక్కాయి.