Trending
IPL 2025 MI VS RCB Updates: వాటి వల్లే వరుస ఓటములు.. రోహిత్ కి ఫామ్ దొరకాలంటే ఆలా ఆడాలి.. ముంబై కోచ్ జయవర్ధనే
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ముంబై ఈ సీజన్లో తేలిపోతోంది.2025లో 5 మ్యాచ్ ల్లో నాలిగింటిలో పరాజయం పాలైంది. గత సీజన్ లో పదో స్థానంలో నిలిచిన ఎంఐ.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ టార్గెట్ గా పెట్టుకుంది.

Mahela Jayawardene Comments: ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆశించినంతగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు నాలిగింటిలో ఓడిపోయి, కేవలం ఒక్కదానిలోనే ఓడిపోయింది. తాజాగా సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగలూరు జట్టు చేతిలో 12 పరుగులతో పోరాడి ఓడిపోయింది. తాజాగా జట్టు ఓటములపై కోచ్ మహేళ జయవర్దనే వ్యాఖ్యానించాడు. పవర్ ప్లేలో చెత్త ఆటతీరుతోనే తమ జట్టు ఓడిపోతోందని, ముఖ్యంగా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని వాపోయాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా పరుగులు లీక్ చేయడంతోపాటు, బ్యాటింగ్ లో త్వరగా వికెట్లను కోల్పోవడం ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించాడు. అలాగే వరుసగా విఫలమవుతున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై కూడా మాట్లాడాడు. ఈ సీజన్ లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆర్సీబీపైన 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్ లో 0, 8, 13 పరుగులు చేసిన రోహిత్.. గాయం కారణంగా నాలుగో మ్యాచ్ లో ఆడలేదు.
లెఫ్టార్మ్ పేసర్ చేతిలో ఔట్..
రోహిత్ శర్మ ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్ల్ చేతిలో ఔట్ కావడం బలహీనతగా మారింది. గత 17 ఇన్నింగ్స్ ల్లో ఏడు సార్లు లెఫ్టార్మ్ పేసర్లకే ఔటయ్యాడు. తాజాగా ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ వేసిన ఇన్ స్వింగింగ్ యార్కర్ కు రోహిత్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటే, ప్రతి బౌలర్ ను మరంత జాగ్రత్తగా ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. నిజానికి రోహిత్ ను ఔట్ చేసిన దయాల్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు. చాలా అద్భుతమైన బంతితో రోహిత్ ను పెవిలియన్ కు పంపాడని పేర్కొన్నాడు. రోహిత్ డిఫెన్స్ ఆడినా, దాన్ని ఛేదించుకుని మరీ బంతి వికెట్లను గిరాటేసిందని తెలిపాడు.
పుంజుకునేనా..?
ఇక ఈ టోర్నీలో ముంబై అంతంతమాత్రంగానే ఆడుతోంది. ఇన్నాళ్లు పరాయి గడ్డపై ఓడిన ముంబై.. తాజాగా సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో కూడా పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం అందించకపోవడం తలనొప్పిగా మారింది. రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ వరుసగా విఫలం అవుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. వీరంతా గాడిలో పడితేనే ముంబై పుంజుకుని ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫామ్ లో ఉండటం సానుకూలాంశం. హార్దిక్ అయితే అటు బ్యాట్, ఇటు బంతితోనూ రాణిస్తున్నాడు. తాజాగా పది వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులోనూ నిలిచాడు. కెరీర్ లో 200 టీ20 వికెట్లను కూడా కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఆడ నుంది.